పనిమనిషిపై అత్యాచారం: ఎమ్మెల్యేపై కేసు
అసోంలో ప్రతిపక్ష ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే గోపీనాథ్ దాస్ తన ఇంట్లో పనిచేసే బాలికపై అత్యాచారం చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. బోకో పోలీసు స్టేషన్ పరిధిలోని మందిరా ఔట్పోస్టులో ఆ బాలిక గత నెల 29న ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే గువాహటి నగరంలో ఆయన కారులోనే తనపై అత్యాచారం చేశాడన్నది ఆమె ఫిర్యాదు. ఆమె ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయంలో నేరస్థులు ఎవరైనా వదిలేది లేదని, చట్టం తనపని తాను చేసుకు పోతుందని కామరూప్ జిల్లా ఎస్పీ ఇంద్రాణి బారువా తెలిపారు.
అయితే, తన ఇంట్లో పనిమనిషి చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే గోపీనాథ్ దాస్ ఖండించారు. ఇదంతా తనపై చేసిన కుట్ర అని, ఇది నూరుశాతం తప్పుడు కేసని ఆయన అంటున్నారు. ఆరోపణలలో వాస్తవం ఎంతన్నది దర్యాప్తులోనే తేలుతుందని ధీమా వ్యక్తం చేశారు. కొన్నాళ్ల క్రితం ఆమె తన ఇంటి నుంచి కొన్ని వస్తువులు తీసుకుని పారిపోయిందని ఆరోపించారు. అయితే.. ఎమ్మెల్యేను వెంటనే అరెస్టుచేసి శిక్షించాలంటూ మహిళా సంఘాలు, వివిధ విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేస్తున్నారు.