assam mla
-
భార్యకు టికెట్ ఇవ్వలేదని ఎమ్మెల్యే రాజీనామా
తన భార్యకు సీటవ్వలేదని ఓ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేసిన ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. లఖింపూర్ జిల్లాలోని నౌబోయిచా నియోజకవర్గ ఎమ్మెల్యే భరత్ చంద్ర నారా.. తన భార్యకు లోక్‌సభ టికెట్ నిరాకరించడంతో తక్షణమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. లఖింపూర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి తన సతీమణి, మాజీ ఎంపీ రాణీ నారాకు పార్టీ టికెట్ నిరాకరించడంతో భరత్ చంద్ర నారా రాజీనామా చేశారు. ఏప్రిల్ 19న ఇక్కడ లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.ఈమేరకు ఆదివారం సాయంత్రం భరత్ చంద్ర నారా తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపారు. భరత్ చంద్ర నారా రాజీనామాను అస్సాం సీఎల్పీ నాయకుడు దేబబ్రత సైకియా ధ్రువీకరించారు. అంతకుముందు నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. వీరిలో ఒక ఎమ్మెల్యే షెర్మాన్ అలీ అహ్మద్ సస్పెండ్ అయ్యారు. మిగిలిన శాసనసభ్యులు శశికాంత దాస్, సిద్ధిక్ అహ్మద్, కమలాఖ్య డే పుర్కాయస్థ, బసంత దాస్‌లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు. అస్సాంలోని 14 లోక్‌సభ నియోజకవర్గాలకు మూడు దశల్లో ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అస్సాంలోని 14 స్థానాల్లో బీజేపీ 7 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ చెరో మూడు స్థానాలను దక్కించుకున్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ తన సీట్ల సంఖ్యను తొమ్మిదికి పెంచుకోగలిగింది. కాంగ్రెస్ తన మూడు స్థానాలను నిలుపుకొంది. ఏఐయూడీఎఫ్ ఒక్క సీటును మాత్రమే గెలుచుకుంది. Assam Congress MLA Bharat Chandra Narah tenders his resignation from the party. pic.twitter.com/3aauZNQFYm — ANI (@ANI) March 25, 2024 -
ఎమ్మెల్యేగా ఎన్నికైన నెలరోజులకే కరోనాకు బలి
డిస్పూర్: మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ అదుపులోకి వస్తున్నా మరణాలు పెరగడం ఆందోళన కలిగించే విషయమే. కరోనా బారిన పడిన వారు పెద్ద ఎత్తున మృతి చెందుతున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే కరోనాతో బాధపడుతూ మృత్యువాత పడ్డారు. ఆయనే అసోంకు చెందిన లెహో రామ్ బొరో. గౌహతి వైద్య కళాశాల ఆస్పత్రి (జీఎంసీహెచ్)లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ అండ్ యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్) తరఫున ఇటీవల జరిగిన ఎన్నికల్లో తముల్పూర్ స్థానం నుంచి గెలిచాడు. ఎమ్మెల్యేగా ఎన్నికై నెల కూడా కాకముందే ఆయన కన్నుమూశాడు. ఆయన మృతికి మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవల్ సంతాపం ప్రకటించారు. ఆయనతోపాటు ఆ పార్టీకి చెందిన నాయకులు నివాళులర్పించారు. -
స్మృతి ఇరానీపై వివాదస్పద వ్యాఖ్యలు, ఉద్రిక్తత
గువాహటి: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నీలమణి సేన్ డేకా వివాదస్పదవ్యాఖ్యలపై అసోం రాజధాని గువాహటిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ క్షమాపణ చెప్పాలని, నీలమణిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. బీజేపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో టియర్ గ్యాస్ ప్రయోగించి పోలీసులు వారిని చెదరగొట్టారు. బీజేపీ కార్యకర్తల దాడిలో 27 మంది కాంగ్రెస్ నాయకులు గాయపడ్డారని, మూడు వాహనాలు ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు. కాగా, నీలమణి వ్యాఖ్యలను తరుణ్ గొగొయ్ ఖండించారు. ఈ వ్యాఖ్యలు నీతిబాహ్యంగా, అన్యాయంగా ఉన్నాయని పేర్కొన్నారు. స్మృతి ఇరానీపై తన వ్యాఖ్యల పట్ల నీలమణి క్షమాపణ చెప్పారు. తాను చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుంటున్నానని అన్నారు. క్షమాపణ చెప్పిన తర్వాత కూడా బీజేపీ ఎందుకు హింసకు పాల్పడుతోందని ఆయన ప్రశ్నించారు. -
పనిమనిషిపై అత్యాచారం: ఎమ్మెల్యేపై కేసు
అసోంలో ప్రతిపక్ష ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే గోపీనాథ్ దాస్ తన ఇంట్లో పనిచేసే బాలికపై అత్యాచారం చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. బోకో పోలీసు స్టేషన్ పరిధిలోని మందిరా ఔట్‌పోస్టులో ఆ బాలిక గత నెల 29న ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే గువాహటి నగరంలో ఆయన కారులోనే తనపై అత్యాచారం చేశాడన్నది ఆమె ఫిర్యాదు. ఆమె ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయంలో నేరస్థులు ఎవరైనా వదిలేది లేదని, చట్టం తనపని తాను చేసుకు పోతుందని కామరూప్ జిల్లా ఎస్పీ ఇంద్రాణి బారువా తెలిపారు. అయితే, తన ఇంట్లో పనిమనిషి చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే గోపీనాథ్ దాస్ ఖండించారు. ఇదంతా తనపై చేసిన కుట్ర అని, ఇది నూరుశాతం తప్పుడు కేసని ఆయన అంటున్నారు. ఆరోపణలలో వాస్తవం ఎంతన్నది దర్యాప్తులోనే తేలుతుందని ధీమా వ్యక్తం చేశారు. కొన్నాళ్ల క్రితం ఆమె తన ఇంటి నుంచి కొన్ని వస్తువులు తీసుకుని పారిపోయిందని ఆరోపించారు. అయితే.. ఎమ్మెల్యేను వెంటనే అరెస్టుచేసి శిక్షించాలంటూ మహిళా సంఘాలు, వివిధ విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేస్తున్నారు.