స్మృతి ఇరానీపై వివాదస్పద వ్యాఖ్యలు, ఉద్రిక్తత
గువాహటి: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నీలమణి సేన్ డేకా వివాదస్పదవ్యాఖ్యలపై అసోం రాజధాని గువాహటిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ క్షమాపణ చెప్పాలని, నీలమణిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. బీజేపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో టియర్ గ్యాస్ ప్రయోగించి పోలీసులు వారిని చెదరగొట్టారు. బీజేపీ కార్యకర్తల దాడిలో 27 మంది కాంగ్రెస్ నాయకులు గాయపడ్డారని, మూడు వాహనాలు ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు.
కాగా, నీలమణి వ్యాఖ్యలను తరుణ్ గొగొయ్ ఖండించారు. ఈ వ్యాఖ్యలు నీతిబాహ్యంగా, అన్యాయంగా ఉన్నాయని పేర్కొన్నారు. స్మృతి ఇరానీపై తన వ్యాఖ్యల పట్ల నీలమణి క్షమాపణ చెప్పారు. తాను చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుంటున్నానని అన్నారు. క్షమాపణ చెప్పిన తర్వాత కూడా బీజేపీ ఎందుకు హింసకు పాల్పడుతోందని ఆయన ప్రశ్నించారు.