ఫైవ్ స్టార్ హోటల్ సీజ్
హరిద్వార్: గంగా నదిని అపవిత్రం చేస్తున్న ఫైవ్ స్టార్ హోటల్ పై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. పవిత్ర గంగా నదిని కాలుష్య కసారం చేస్తున్నందుకు హరిద్వార్ లోని రాడిసన్ బ్లూ ఫైవ్ స్టార్ హోటల్ ను ఉత్తరాండ్ కాలుష్య నియంత్రణ బోర్డ్(ఎస్పీసీబీ) అధికారులు సీజ్ చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) నిబంధనలకు విరుద్ధంగా కాల్యుష్యాన్ని గంగా నదిలోకి వదులుతున్నందుకు ఈ చర్య తీసుకున్నామని ఎస్పీసీబీ రూర్కీ ప్రాంతీయ అధికారి అంకుర్ కాన్సాల్ తెలిపారు.
ఎన్జీటీ నివేదిక ఆధారంగా పది రోజుల క్రితం నోటీసు ఇచ్చినా హోటల్ యాజమాన్యం పద్ధతి మార్చుకోలేదని ఎస్పీసీబీ కార్యదర్శి వినోద్ సింఘాల్ వెల్లడించారు. కాలుష్య కారకాల ఆధారంగా హోటళ్లను మూడు విభాగాలుగా ఎస్పీసీబీ వర్గీకరించింది. గంగా నదిని కాలుష్య రహితంగా, స్వచ్ఛంగా మార్చేందుకు నరేంద్ర మోదీ సర్కారు అధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.