డెంగ్యూ మహిళా రోగిపై లైంగిక దుశ్చర్య
బెంగళూరు: డెంగ్యూ వాధితో బాధపడుతూ.. తీవ్ర అస్వస్థతతో ఉన్న 54 ఏళ్ల మహిళపై ఫోర్టిస్ ఆస్పత్రి అటెండెంట్ లైంగిక దుశ్చర్యలకు పాల్పడ్డాడు. ఆమె మర్మాంగాలను తాకి.. తీవ్ర అసభ్యంగా వ్యవహరించాడు. ఈ ఘటనపై పోలీసులు కేవలం లైంగిక వేధింపుల కేసు నమోదుచేశారు. దీనిపై బాధిత మహిళ కుటుంబసభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 'అది సాంకేతికంగా అత్యాచారమే. అయినా పోలీసులే లైంగిక వేధింపుల కేసు మాత్రమే నమోదు చేశారు. మా వాదనను వారు పట్టించుకోలేదు' అని వారు మీడియాకు తెలిపారు. తాము పోలీసులపై నమ్మకం కోల్పోయామని, ఈ ఘటన విషయమై కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించాలని భావిస్తున్నామని వారు తెలిపారు.
గత నెల 5వ తేదీన డెంగ్యూ వ్యాధితో బాధిత మహిళ బెంగళూరులోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరగా.. అర్ధరాత్రి సమయంలో ఆమె గదిలోకి వచ్చిన ఆస్పత్రి అటెండెంట్ శివకుమార్ లైంగిక దుశ్చర్యలకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శివకుమార్‌ను అరెస్టు చేశారు. అయితే, అతనిపై రేప్ కేసు పెట్టకపోవడంపై కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
'నా భార్య తీవ్ర అస్వస్థతతో ఉంది. అతడి లైంగిక దుశ్చర్యలతో ఆమె షాక్‌కు గురయింది. అతడు లైంగిక చర్యలకు పాల్పడుతుండటంతో రాత్రంతా నిద్రలేకుండా తీవ్ర అవస్థ అనుభవించింది. అతడు ఆమె ఛాతిని తాకడమే కాకుండా.. కాళ్లకు మసాజ్ చేసే పేరిట ఆమె మర్మాంగాలను తాకి.. అసభ్య చర్యలకు పాల్పడ్డాడు. ఇది అత్యాచారం కిందకు రాదా?' అని బాధితురాలి భర్త ప్రశ్నించాడు.