fortis hospital
-
రోబోలతో కోవిడ్-19 స్క్రీనింగ్
బెంగళూర్ : కోవిడ్-19 నుంచి ఆరోగ్య సిబ్బందిని కాపాడటంతో పాటు స్క్రీనింగ్ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు మిత్ర రోబోట్ సేవలను ప్రారంభించామని ఫోర్టిస్ హాస్పిటల్ శుక్రవారం వెల్లడించింది. ఆస్పత్రిలో ప్రవేశించే వైద్యులు, నర్సులు, వైద్య, వైద్యేతర సిబ్బందితో పాటు విజిటర్లను స్ర్కీనింగ్ చేసేందుకు రోబో సేవలను వినియోగిస్తామని ఫోర్టిస్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఫేషియల్, స్పీచ్ రికగ్నేషన్ ద్వారా విజిటర్‌కు కోవిడ్-19 లక్షణాలు ఉన్నాయా లేదా అనేది రోబోట్ పసిగడుతుంది. ఈ ప్రక్రియ ద్వారా ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు కరోనా వైరస్ బారిన పడకుండా దూరం పాటించవచ్చని ఫోర్టిస్ హాస్పిటల్ తెలిపింది. రెండు దశల్లో రోబోటిక్ స్ర్కీనింగ్ జరుగుతుందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా హెల్త్‌కేర్ సిబ్బంది మహమ్మారి బారినపడుతున్న క్రమంలో తాము కోవిడ్-19 రోబోటిక్ స్ర్కీనింగ్‌ను ప్రవేశపెట్టామని ఫోర్టిస్ హాస్పిటల్స్ జోనల్ డైరెక్టర్ డాక్టర్ మనీష్ మాటూ తెలిపారు. చదవండి : ఆటో డ్రైవర్‌కు ఆనంద్ మహింద్రా ఆఫర్! -
94 నిమిషాల్లో 323.5 కిలోమీటర్లు!
థానే: దేశంలో మరో అరుదైన ఘటనకు మహారాష్ట్ర వేదికైంది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఓ బాలుడి గుండెను గ్రీన్ కారిడార్ ద్వారా కేవలం 94 నిమిషాల్లో 323.5 కిలోమీటర్లు తరలించి నాలుగేళ్ల చిన్నారికి వైద్యులు విజయవంతంగా అమర్చారు. ఔరంగాబాద్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన బాలుడు(13) శుక్రవారం చనిపోవడంతో అక్కడి ఎంజీఎం ఆస్పత్రిలో గుండెను మధ్యాహ్నం 1.50కి సేకరించారు. అనంతరం పోలీసులు, అధికారులు, ప్రజల సహకారంతో గ్రీన్ కారిడార్ ఏర్పాటుచేసి 4.8 కి.మీ దూరాన్ని నాలుగు నిమిషాల్లో పూర్తిచేసి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ్నుంచి చార్టెడ్ విమానంలో ముంబై విమానాశ్రయానికి మధ్యాహ్నం 3.05 గంటలకు చేరుకున్నారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటుచేయడంతో కేవలం 19 నిమిషాల్లోనే గుండె సబర్బన్ ములుంద్‌లోని ఫోర్టిస్ ఆస్పత్రికి చేరుకుంది. గుండె సమస్యతో ఫోర్టిస్‌లో చికిత్స పొందుతున్న నాలుగేళ్ల చిన్నారికి ఈ గుండెను వైద్యులు అమర్చారు. బాలికకు ఆపరేషన్ విజయవంతమైందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
వామ్మో.. డెంగ్యూ పేషెంట్‌కు రూ.16 లక్షల బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ : డెంగ్యూ పేషెంట్‌కు ఓ ఆసుపత్రి ఏకంగా 16 లక్షలు బిల్లు వసులు చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఠాగుర్ సినిమా సన్నివేశంను తలపించేలా ఉన్న ఈ సంఘటన రెండు నెలల క్రితం దేశరాజధాని ఢిల్లీలోని ఫోర్టీస్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. అంత బిల్లు వసూలు చేసినా సదరు ఆసుపత్రి ఆ పేషంట్‌ను బతికించ లేకపోయింది. ఆ వివరాలు..ఏడేళ్ల ఆద్యా సింగ్‌కు ఆగస్టు 27న తీవ్రమైన జ్వరం రావడంతో చికిత్స నిమిత్తం ద్వారకాలోని రాక్లండ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. చిన్నారికి డెంగీ వచ్చినట్లు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని ఆద్యా తల్లిదండ్రులకు సూచించారు. వెంటనే ఆమెను ఆగస్టు 31న గుర్గావ్లోని ఫోర్టిస్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ప్లేట్ లేట్స్ సంఖ్య పడిపోయింది. చిన్నారి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడంతో 10 రోజుల పాటు ఐసీయూలో ఉంచి ఫోర్టిస్ వైద్యులు చికిత్స అందించారు. సెప్టెంబర్ 14న ఎంఆర్ఐ స్కానింగ్ తీయించారు. ఆ రిపోర్టులో ఆద్యా మెదడు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నట్లు తేలింది. అప్పటికే 16 లక్షలు వసూలు చేసిన ఆసుపత్రి యాజమాన్యం పాప ఆరోగ్యం క్షీణించడంతో చేతులెత్తేసింది. సెప్టెంబర్ 14న ఆద్యా కన్ను మూసింది. ఈ విషయాన్ని ఆద్యా సింగ్ తండ్రి మిత్రుడు.. నవంబర్ 17న ట్విట్టర్లో ప్రస్తావించాడు. పదిహేను రోజుల పాటు డెంగీకి చికిత్స చేసి చివరకు చిన్నారి ప్రాణాలను ఫోర్టిస్ ఆస్పత్రి బలిగొందని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎంతగాంటే కేవలం నాలుగు రోజుల్లోనే 16 వేల రీట్వీట్లు వచ్చాయి. ఈ ట్వీట్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించారు. పూర్తి వివరాలు తమకు ఇవ్వండి.. తప్పకుండా చర్యలు తీసుకుంటామని జేపీ నడ్డా రీట్వీట్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఆరోగ్య కార్యదర్శికి మంత్రి జేపీ నడ్డా ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రిలో 15 రోజులు ఉన్నామని, రోజుకు 40 సిరంజీల లెక్కన 660 సిరంజీలకు చార్జ్ చేశారని, ఎక్కువ డోస్ కలిగిన యాంటీ బయోటిక్స్,1600 గ్లోవ్స్ ఉపయోగించారని ఆ చిన్నారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
బీజేపీ నేతపై వంద రౌండ్ల కాల్పులు
ఘజియాబాద్: స్థానిక బీజేపీ నేత బ్రిజ్ పాల్ టియోటియా (54) కారుపై గుర్తుతెలియని దుండగులు వంద రౌండ్ల కాల్పులు జరిపారు. దాడిలో తీవ్రంగా గాయపడిన బ్రిజ్ పాల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎన్ హెచ్-58పై కాల్పులు జరిగాయని సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన అక్కడికి చేరుకుని టియోటియాను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రిజ్ పాల్ కాన్వాయ్ పై ఫార్చూనర్లో వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఏకే-47, 9ఎంఎం పిస్టళ్లతో కాల్పులు జరిపారు. దాదాపు వంద రౌండ్లు కాల్పుల జరిపిన ఈ దాడిలో బ్రిజ్ పాల్ కు ఐదు బుల్లెట్లు తగిలాయి. ఆయన వెంట ఉన్న నలుగురు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి కూడా బుల్లెట్లు తగలడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. సెక్యూరిటీ సిబ్బందిని ఘజియాబాద్ లోని సర్వోదయ ఆసుపత్రికి, బ్రిజ్ పాల్ ను నోయిడాలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. తీవ్రంగా గాయపడిన బ్రిజ్ పాల్ ను ఎమర్జెన్సీ వార్డులో ఉంచినట్లు తెలిపారు. సంఘటనా స్థలం నుంచి ఏకే-47, రెండు 9ఎంఎం పిస్టల్స్, రైఫిల్ తో పాటు భారీ మొత్తంలో బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పాతకక్షల నేపథ్యంలోనే దాడి జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఏడీజీ దల్జీత్ సింగ్ చెప్పారు. కేసును అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు. నేరస్తులను పట్టుకునేందుకు ఈ కేసును స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చికిత్సపొందుతున్న బ్రిజ్ పాల్ కోలుకుంటున్నట్లు తమకు సమాచారం ఉందని చెప్పారు. గత కొద్ది సంవత్సరాలుగా బ్రిజ్ పాల్ బీజేపీ కిసాన్ మోర్చాలో సభ్యునిగా ఉన్నారు. 2012 ఉత్తరప్రదేశ్ లోని మురద్ నగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. -
ఆపరేషన్ చేయాల్సిన చోట చేయకుండా..
జమ్మూకశ్మీర్: జమ్మూకాశ్మీర్‌లో వైద్యులు పెద్దతప్పిదం చేశారు. ఒక చోట చేయాల్సిన శస్త్ర చికిత్స మరోచోట చేసి అబాసుపాలయ్యారు. ఈ తప్పిదంతో ఆస్పత్రి యాజమాన్యం ఆపరేషన్ చేసిన ఐదుగురిని డిస్మిస్ చేసింది. షాలిమార్ బాగ్‌కు చెందిన రవి రాయ్ అనే 24 చార్టెడ్ ఎకౌంటెంట్కి ఇంట్లో మెట్లు జారీపడి కుడికాలి చీలమండలంలో గాయమైంది. దీంతో అతడిని కుటుంబ సభ్యులు ఫార్టిస్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రికి వెళ్లిన తర్వాత పరీక్షలు, స్కానింగ్ చేసిన వైద్యులు కుడి కాలి చీలమండలం జాయింట్లో గాయమైనట్లు గుర్తించారు. అనంతరం ఆపరేషన్ మాత్రం ఎడమకాలి చీలమండలానికి చేశారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత అది చూసిన కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. కుడికాలికి అవసరం అయితే, ఎడమకాలికి చికిత్స ఎలా చేస్తారని నిలదీశారు. దానికి వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఎలాంటి సమస్య లేకుండా తిరిగి మరోసారి ఎడమకాలికి చికిత్స చేస్తామని అన్నారు. పరీక్షలు చేసి, స్కానింగ్ చేసి, ఆఖరికి ఆపరేషన్ మాత్రం చేయాల్సిన కాలికి కాకుండా వేరే కాలికి చేసి తిరిగి ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా అని ఆగ్రహంతో అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యం ఐదుగురు సిబ్బందిని విధుల నుంచి తప్పించింది. -
డెంగ్యూ మహిళా రోగిపై లైంగిక దుశ్చర్య
బెంగళూరు: డెంగ్యూ వాధితో బాధపడుతూ.. తీవ్ర అస్వస్థతతో ఉన్న 54 ఏళ్ల మహిళపై ఫోర్టిస్ ఆస్పత్రి అటెండెంట్ లైంగిక దుశ్చర్యలకు పాల్పడ్డాడు. ఆమె మర్మాంగాలను తాకి.. తీవ్ర అసభ్యంగా వ్యవహరించాడు. ఈ ఘటనపై పోలీసులు కేవలం లైంగిక వేధింపుల కేసు నమోదుచేశారు. దీనిపై బాధిత మహిళ కుటుంబసభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 'అది సాంకేతికంగా అత్యాచారమే. అయినా పోలీసులే లైంగిక వేధింపుల కేసు మాత్రమే నమోదు చేశారు. మా వాదనను వారు పట్టించుకోలేదు' అని వారు మీడియాకు తెలిపారు. తాము పోలీసులపై నమ్మకం కోల్పోయామని, ఈ ఘటన విషయమై కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించాలని భావిస్తున్నామని వారు తెలిపారు. గత నెల 5వ తేదీన డెంగ్యూ వ్యాధితో బాధిత మహిళ బెంగళూరులోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరగా.. అర్ధరాత్రి సమయంలో ఆమె గదిలోకి వచ్చిన ఆస్పత్రి అటెండెంట్ శివకుమార్ లైంగిక దుశ్చర్యలకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శివకుమార్‌ను అరెస్టు చేశారు. అయితే, అతనిపై రేప్ కేసు పెట్టకపోవడంపై కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 'నా భార్య తీవ్ర అస్వస్థతతో ఉంది. అతడి లైంగిక దుశ్చర్యలతో ఆమె షాక్‌కు గురయింది. అతడు లైంగిక చర్యలకు పాల్పడుతుండటంతో రాత్రంతా నిద్రలేకుండా తీవ్ర అవస్థ అనుభవించింది. అతడు ఆమె ఛాతిని తాకడమే కాకుండా.. కాళ్లకు మసాజ్ చేసే పేరిట ఆమె మర్మాంగాలను తాకి.. అసభ్య చర్యలకు పాల్పడ్డాడు. ఇది అత్యాచారం కిందకు రాదా?' అని బాధితురాలి భర్త ప్రశ్నించాడు. -
‘కొలువు’దీరిన మృత్యువు..!
పోలీసు శాఖలో ఉద్యోగం అంటే జీవితంలో స్థిరపడినట్లే.. అలాంటి ఉద్యోగం కోసం ఎంత శ్రమైనా పడటానికి యువకులు వెనుకాడటం లేదు. అయితే మండుటెండలు, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, కనీస అవసరాల కల్పనలో అలసత్వం ఈ యువకుల ప్రాణాల మీదకు తెస్తోంది. పోలీసు శాఖలో భర్తీ ప్రక్రియ జరిగే ప్రతిసారీ ఇదే పరిస్థితి పునరావృతం అవుతుండటం విషాదం.. సాక్షి, ముంబై: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పోలీసుల భర్తీ ప్రక్రియ యువకుల పాలిట శాపంగా మారుతోంది. పోలీసు శాఖలో ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో వచ్చిన యువకుల ప్రాణాలను బలిగొంటోంది. ఇప్పటికే ఈ ప్రక్రియకు ముగ్గురు యువకులు బలి కాగా, శనివారం మరో యువకుడు మృత్యువాత పడటం ఆందోళనకు గురిచేసింది. మూడు రోజులుగా ఫోర్టీస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాహుల్ సక్పాల్ శనివారం ఉదయం మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. దీంతో గత వారం రోజుల్లో పోలీసుల భర్తీ ప్రక్రియ కారణంగా మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. విక్రోలి కన్నంవార్నగర్లో బుధవారం అయిదు కిలోమీటర్ల పరుగు పందెంలో రాహుల్ వడదెబ్బ కారణంగా కుప్పకూలిపోయాడు. అనంతరం భాండూప్‌లోని ఫోర్టీస్ ఆసుపత్రిలో చేర్పించగా శనివారం చికిత్స పొందుతూ మరణించాడు. రాహుల్ సక్పాల్కు ముందు మాలవణ్కు చెందిన అంబదాస్ సోనవణే, విరార్‌కు చెందిన ప్రసాద్ మాలి, విశాల్ కేదారే అనే యువకులు మరణించిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి బిల్లుపై వివాదం..? పోలీసు శాఖలో ఉద్యోగం సంపాదించుకొస్తానని వెళ్లిన రాహుల్ తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరి శనివారం ఉదయం మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే అతడి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించేందుకు ఫోర్టీస్ ఆసుపత్రి వర్గాలు నిరాకరించాయని తెలిసింది. ఈ విషయంపై అందిన వివరాల మేరకు ముఖ్యంగా మూడు రోజుల చికిత్స కోసం సుమారు రూ. 1.30 లక్షల బిల్లు చెల్లించాలని, లేదంటే మృతదేహాన్ని అప్పగించబోమని ఆస్పత్రి హెచ్చరించిందని రాహుల్ కుటుంబీకులు ఆరోపించారు. నిర్లక్ష్యం కారణంగానే.. మహారాష్ట్ర పోలీసు శాఖలో భర్తీ ప్రక్రియ సందర్భంగా అభ్యర్థులకు కనీస సౌకర్యాల కల్పనలో విఫలమయ్యేరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భర్తీ ప్రక్రియకు యువకులు వేలాదిగా తరలివస్తారని తెలిసి కూడా సౌకర్యాలు ఏర్పాటుచేయడంలో వారు ఎటువంటి చొరవ చూపలేదని, కనీసం మంచినీటి సదుపాయం కూడా కల్పించలేకపోయారని తెలుస్తోంది. అలాగే ఎంపికలో నియమ,నిబంధనలను సైతం పాటించడం లేదని, ఇష్టానుసారం ఎంపిక ప్రక్రియను చేపడుతున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీంతో పలువురు మృత్యువాత పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల భర్తీ కోసం ఆ శాఖ 2014 మే 13న విడుదల చేసిన ప్రకటన ప్రకారం అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలను ఉదయం 9.30 గంటల లోపు, సాయంత్రం 4.30 తర్వాత నిర్వహించాలి. అయితే ఈ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ఉన్నతాధికారులు మిట్టమధ్యాహ్నం కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మండు వేసవి.. మిట్టమధ్యాహ్నం ఐదు కిలోమీటర్లు పరిగెత్తితే ఆ వ్యక్తి ఆరోగ్య స్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాగా, వేలాదిమంది పాల్గొనే ఈ పరీక్షల సమయంలో కనీస వైద్య సదుపాయాలను కూడా ఏర్పాటుచేయకపోవడంతో యువకులకు వడదెబ్బ తగిలిన రెండు, మూడు గంటల తర్వాత గాని వైద్య సేవలు అందడంలేదని తెలుస్తోంది. అదేవిధంగా తమ వంతు వచ్చేంతవరకు వేచి ఉండేందుకు కనీసం షెడ్లు కూడా నిర్మించలేద న్న ఫిర్యాదులు ఉన్నాయి. ‘రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లిస్తాం..’ ముంబై: పోలీసుల భర్తీ ప్రక్రియలో వడదెబ్బ తగిలి మృతిచెందిన నలుగురు యువకులకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ శనివారం అసెంబ్లీలో ప్రకటించారు. వారికి ఆస్పత్రుల్లో అయిన వైద్యఖర్చులు సైతం ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. దేహదారుఢ్య పరీక్షలను ఉదయం 8 గంటల వరకు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించామన్నారు. వచ్చే ఏడాది నుంచి నడక/పరుగు పరీక్ష దూరాన్ని 5 కి.మీ. నుంచి 3 కి.మీ.లకు తగ్గించనున్నట్లు ప్రకటించారు.