‘కొలువు’దీరిన మృత్యువు..! | seems to have failed at least in freshwater access | Sakshi
Sakshi News home page

‘కొలువు’దీరిన మృత్యువు..!

Published Sat, Jun 14 2014 10:55 PM | Last Updated on Sat, Sep 2 2017 8:48 AM

‘కొలువు’దీరిన మృత్యువు..!

‘కొలువు’దీరిన మృత్యువు..!

పోలీసు శాఖలో ఉద్యోగం అంటే జీవితంలో స్థిరపడినట్లే.. అలాంటి ఉద్యోగం కోసం ఎంత శ్రమైనా పడటానికి యువకులు వెనుకాడటం లేదు. అయితే మండుటెండలు, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, కనీస అవసరాల కల్పనలో అలసత్వం ఈ యువకుల ప్రాణాల మీదకు తెస్తోంది. పోలీసు శాఖలో భర్తీ ప్రక్రియ జరిగే ప్రతిసారీ ఇదే పరిస్థితి పునరావృతం అవుతుండటం విషాదం..
 
సాక్షి, ముంబై: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పోలీసుల భర్తీ ప్రక్రియ యువకుల పాలిట శాపంగా మారుతోంది. పోలీసు శాఖలో ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో వచ్చిన యువకుల ప్రాణాలను బలిగొంటోంది. ఇప్పటికే ఈ ప్రక్రియకు ముగ్గురు యువకులు బలి కాగా, శనివారం మరో యువకుడు మృత్యువాత పడటం ఆందోళనకు గురిచేసింది. మూడు రోజులుగా ఫోర్టీస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాహుల్ సక్‌పాల్ శనివారం ఉదయం మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.
 
దీంతో గత వారం రోజుల్లో పోలీసుల భర్తీ ప్రక్రియ కారణంగా మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. విక్రోలి కన్నంవార్‌నగర్‌లో బుధవారం అయిదు కిలోమీటర్ల పరుగు పందెంలో  రాహుల్  వడదెబ్బ కారణంగా కుప్పకూలిపోయాడు. అనంతరం భాండూప్‌లోని ఫోర్టీస్ ఆసుపత్రిలో చేర్పించగా శనివారం చికిత్స పొందుతూ మరణించాడు. రాహుల్ సక్‌పాల్‌కు ముందు మాలవణ్‌కు చెందిన అంబదాస్ సోనవణే, విరార్‌కు చెందిన ప్రసాద్ మాలి, విశాల్ కేదారే అనే  యువకులు మరణించిన సంగతి తెలిసిందే.
 
ఆస్పత్రి బిల్లుపై వివాదం..?
పోలీసు శాఖలో ఉద్యోగం సంపాదించుకొస్తానని వెళ్లిన రాహుల్ తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరి శనివారం ఉదయం మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే అతడి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించేందుకు ఫోర్టీస్ ఆసుపత్రి వర్గాలు నిరాకరించాయని తెలిసింది. ఈ విషయంపై అందిన వివరాల మేరకు ముఖ్యంగా మూడు రోజుల చికిత్స కోసం సుమారు రూ. 1.30 లక్షల బిల్లు చెల్లించాలని, లేదంటే మృతదేహాన్ని అప్పగించబోమని ఆస్పత్రి హెచ్చరించిందని రాహుల్ కుటుంబీకులు ఆరోపించారు.   
 
నిర్లక్ష్యం కారణంగానే..
మహారాష్ట్ర పోలీసు శాఖలో భర్తీ ప్రక్రియ సందర్భంగా అభ్యర్థులకు కనీస సౌకర్యాల కల్పనలో విఫలమయ్యేరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భర్తీ ప్రక్రియకు యువకులు వేలాదిగా తరలివస్తారని తెలిసి కూడా సౌకర్యాలు ఏర్పాటుచేయడంలో వారు ఎటువంటి చొరవ చూపలేదని, కనీసం మంచినీటి సదుపాయం కూడా కల్పించలేకపోయారని తెలుస్తోంది. అలాగే ఎంపికలో నియమ,నిబంధనలను సైతం పాటించడం లేదని, ఇష్టానుసారం ఎంపిక ప్రక్రియను చేపడుతున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీంతో పలువురు మృత్యువాత పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
పోలీసుల భర్తీ కోసం ఆ శాఖ 2014 మే 13న విడుదల చేసిన ప్రకటన ప్రకారం అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలను ఉదయం 9.30 గంటల లోపు, సాయంత్రం 4.30 తర్వాత నిర్వహించాలి. అయితే ఈ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ఉన్నతాధికారులు  మిట్టమధ్యాహ్నం కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మండు వేసవి.. మిట్టమధ్యాహ్నం ఐదు కిలోమీటర్లు పరిగెత్తితే ఆ వ్యక్తి ఆరోగ్య స్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాగా, వేలాదిమంది పాల్గొనే ఈ పరీక్షల సమయంలో కనీస వైద్య సదుపాయాలను కూడా ఏర్పాటుచేయకపోవడంతో యువకులకు వడదెబ్బ తగిలిన రెండు, మూడు గంటల తర్వాత గాని వైద్య సేవలు అందడంలేదని తెలుస్తోంది.  అదేవిధంగా తమ  వంతు వచ్చేంతవరకు వేచి ఉండేందుకు కనీసం షెడ్‌లు కూడా నిర్మించలేద న్న ఫిర్యాదులు ఉన్నాయి.
 
‘రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లిస్తాం..’
ముంబై: పోలీసుల భర్తీ ప్రక్రియలో వడదెబ్బ తగిలి మృతిచెందిన నలుగురు యువకులకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ శనివారం అసెంబ్లీలో ప్రకటించారు. వారికి ఆస్పత్రుల్లో అయిన వైద్యఖర్చులు సైతం ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. దేహదారుఢ్య పరీక్షలను ఉదయం 8 గంటల వరకు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించామన్నారు. వచ్చే ఏడాది నుంచి నడక/పరుగు పరీక్ష దూరాన్ని 5 కి.మీ. నుంచి 3 కి.మీ.లకు తగ్గించనున్నట్లు ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement