బీజేపీ నేతపై వంద రౌండ్ల కాల్పులు
ఘజియాబాద్: స్థానిక బీజేపీ నేత బ్రిజ్ పాల్ టియోటియా (54) కారుపై గుర్తుతెలియని దుండగులు వంద రౌండ్ల కాల్పులు జరిపారు. దాడిలో తీవ్రంగా గాయపడిన బ్రిజ్ పాల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎన్ హెచ్-58పై కాల్పులు జరిగాయని సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన అక్కడికి చేరుకుని టియోటియాను ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రిజ్ పాల్ కాన్వాయ్ పై ఫార్చూనర్‌లో వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఏకే-47, 9ఎంఎం పిస్టళ్లతో కాల్పులు జరిపారు. దాదాపు వంద రౌండ్లు కాల్పుల జరిపిన ఈ దాడిలో బ్రిజ్ పాల్ కు ఐదు బుల్లెట్లు తగిలాయి. ఆయన వెంట ఉన్న నలుగురు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి కూడా బుల్లెట్లు తగలడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. సెక్యూరిటీ సిబ్బందిని ఘజియాబాద్ లోని సర్వోదయ ఆసుపత్రికి, బ్రిజ్ పాల్ ను నోయిడాలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
తీవ్రంగా గాయపడిన బ్రిజ్ పాల్ ను ఎమర్జెన్సీ వార్డులో ఉంచినట్లు తెలిపారు. సంఘటనా స్థలం నుంచి ఏకే-47, రెండు 9ఎంఎం పిస్టల్స్, రైఫిల్ తో పాటు భారీ మొత్తంలో బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పాతకక్షల నేపథ్యంలోనే దాడి జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఏడీజీ దల్జీత్ సింగ్ చెప్పారు. కేసును అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు. నేరస్తులను పట్టుకునేందుకు ఈ కేసును స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు అప్పగిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం చికిత్సపొందుతున్న బ్రిజ్ పాల్ కోలుకుంటున్నట్లు తమకు సమాచారం ఉందని చెప్పారు. గత కొద్ది సంవత్సరాలుగా బ్రిజ్ పాల్ బీజేపీ కిసాన్ మోర్చాలో సభ్యునిగా ఉన్నారు. 2012 ఉత్తరప్రదేశ్ లోని మురద్ నగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.