థానే: దేశంలో మరో అరుదైన ఘటనకు మహారాష్ట్ర వేదికైంది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఓ బాలుడి గుండెను గ్రీన్ కారిడార్ ద్వారా కేవలం 94 నిమిషాల్లో 323.5 కిలోమీటర్లు తరలించి నాలుగేళ్ల చిన్నారికి వైద్యులు విజయవంతంగా అమర్చారు. ఔరంగాబాద్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన బాలుడు(13) శుక్రవారం చనిపోవడంతో అక్కడి ఎంజీఎం ఆస్పత్రిలో గుండెను మధ్యాహ్నం 1.50కి సేకరించారు. అనంతరం పోలీసులు, అధికారులు, ప్రజల సహకారంతో గ్రీన్ కారిడార్ ఏర్పాటుచేసి 4.8 కి.మీ దూరాన్ని నాలుగు నిమిషాల్లో పూర్తిచేసి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ్నుంచి చార్టెడ్ విమానంలో ముంబై విమానాశ్రయానికి మధ్యాహ్నం 3.05 గంటలకు చేరుకున్నారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటుచేయడంతో కేవలం 19 నిమిషాల్లోనే గుండె సబర్బన్ ములుంద్‌లోని ఫోర్టిస్ ఆస్పత్రికి చేరుకుంది. గుండె సమస్యతో ఫోర్టిస్‌లో చికిత్స పొందుతున్న నాలుగేళ్ల చిన్నారికి ఈ గుండెను వైద్యులు అమర్చారు. బాలికకు ఆపరేషన్ విజయవంతమైందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment