సాక్షి, న్యూఢిల్లీ : డెంగ్యూ పేషెంట్‌కు ఓ ఆసుపత్రి ఏకంగా 16 లక్షలు బిల్లు వసులు చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఠాగుర్ సినిమా సన్నివేశంను తలపించేలా ఉన్న ఈ సంఘటన రెండు నెలల క్రితం దేశరాజధాని ఢిల్లీలోని ఫోర్టీస్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. అంత బిల్లు వసూలు చేసినా సదరు ఆసుపత్రి ఆ పేషంట్‌ను బతికించ లేకపోయింది.
ఆ వివరాలు..ఏడేళ్ల ఆద్యా సింగ్‌కు ఆగస్టు 27న తీవ్రమైన జ్వరం రావడంతో చికిత్స నిమిత్తం ద్వారకాలోని రాక్లండ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. చిన్నారికి డెంగీ వచ్చినట్లు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని ఆద్యా తల్లిదండ్రులకు సూచించారు.
వెంటనే ఆమెను ఆగస్టు 31న గుర్గావ్‌లోని ఫోర్టిస్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ప్లేట్ లేట్స్ సంఖ్య పడిపోయింది. చిన్నారి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడంతో 10 రోజుల పాటు ఐసీయూలో ఉంచి ఫోర్టిస్ వైద్యులు చికిత్స అందించారు. సెప్టెంబర్ 14న ఎంఆర్‌ఐ స్కానింగ్ తీయించారు. ఆ రిపోర్టులో ఆద్యా మెదడు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నట్లు తేలింది. అప్పటికే 16 లక్షలు వసూలు చేసిన ఆసుపత్రి యాజమాన్యం పాప ఆరోగ్యం క్షీణించడంతో చేతులెత్తేసింది. సెప్టెంబర్ 14న ఆద్యా కన్ను మూసింది.
ఈ విషయాన్ని ఆద్యా సింగ్ తండ్రి మిత్రుడు.. నవంబర్ 17న ట్విట్టర్‌లో ప్రస్తావించాడు. పదిహేను రోజుల పాటు డెంగీకి చికిత్స చేసి చివరకు చిన్నారి ప్రాణాలను ఫోర్టిస్ ఆస్పత్రి బలిగొందని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎంతగాంటే కేవలం నాలుగు రోజుల్లోనే 16 వేల రీట్వీట్లు వచ్చాయి.
ఈ ట్వీట్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించారు. పూర్తి వివరాలు తమకు ఇవ్వండి.. తప్పకుండా చర్యలు తీసుకుంటామని జేపీ నడ్డా రీట్వీట్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఆరోగ్య కార్యదర్శికి మంత్రి జేపీ నడ్డా ఆదేశాలు జారీ చేశారు.
ఆసుపత్రిలో 15 రోజులు ఉన్నామని, రోజుకు 40 సిరంజీల లెక్కన 660 సిరంజీలకు చార్జ్ చేశారని, ఎక్కువ డోస్ కలిగిన యాంటీ బయోటిక్స్,1600 గ్లోవ్స్ ఉపయోగించారని ఆ చిన్నారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment