ఆ కిరాతకుడు వీడే!
ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్న ప్రజలపై నిర్దాక్షిణ్యంగా ట్రక్కుతో దూసుకెళ్లి మారణహోమాన్ని సృష్టించిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదిని పోలీసులు గుర్తించారు. ఈ అమానుష కిరాతకంలో పదిమంది చిన్నారులు సహా 84 మంది మృతిచెందారు. ఫ్రెంచ్-ట్యునీషియన్ అయిన 31 ఏళ్ల మహమద్ లహోహెజా బౌలెల్ అనే వ్యక్తి ఈ దుర్మార్గానికి కారణమని పోలీసులు కనుగొన్నట్టు స్థానిక పత్రిక 'నీస్ మాటిన్' తెలిపింది. మహమద్‌కు పెళ్లి అయిందని, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని తెలిపింది.
నీస్‌లో గురువారం రాత్రి పేవ్‌మెంటు మీద వేడుకల్లో మునిగిపోయిన ప్రజలపైకి ట్రక్కును పోనిచ్చి మహమద్ నరమేధాన్ని సృష్టించాడు. అతడు దూసుకుపోయిన మేరకు కుప్పలుతెప్పలుగా గాలిలోకి మనుషులు ఎగిరిపడ్డారని, సంఘటనా ప్రాంతంలో ఎక్కడా చూసిన రక్తపుమడుగులు ప్రజల మృతదేహాలు పడి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ నరమేధం ప్రారంభమైన అరగంట తర్వాత భద్రతా దళాలు సాహసోపేతంగా జరిపిన కాల్పుల్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాది ప్రాణాలు విడిచాడని, అతను వాహనంలో ఉండగానే భద్రతాదళాలు కాల్పులు జరిపాయని, నేరుగా బుల్లెట్లు తగలడంతో వాహనం నడుపుతూనే అతను ప్రాణాలు విడిచాడని చెప్పారు.