
సత్ప్రవర్తనతో పెరోల్‌పై వెళ్లి.. 9 హత్యలు!
హత్యానేరంలో జీవితఖైదు శిక్ష పడి, తొమ్మిదేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ఖైదీని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అయితే ఈలోపే అతడు మరో 9 మందిని హతమార్చాడు. హరియాణాకు చెందిన సతీష్ అలియాస్ కాలా అలియాస్ మౌనా అనే గ్యాంగ్‌స్టర్ అంతకుముందు జైల్లో ఉండగా సత్ప్రవర్తనకు గాను పెరోల్ లభించి బయటకు వెళ్లాడు. అప్పటినుంచి ఇక మళ్లీ జైలుకు తిరిగి రాకుండా తొమ్మిది మందిని హత్య చేశాడు. గుర్‌గ్రామ్ క్రైం బ్రాంచి వాళ్లు దాదాపు డజను వరకు హత్యల కేసులను విచారిస్తుండగా అందులో మొత్తం ఐదుగురు కరడుగట్టిన ఖైదీలను గుర్తించారు. వాళ్లంతా ఒక పౌల్ట్రీ ఫారంలో దాక్కుని ఉండగా విశ్వసనీయ సమాచారం అంది వాళ్లను పట్టుకున్నారు. 2008లో పెరోల్ వచ్చిన సతీష్.. ఆ తర్వాత సందీప్ గడోలి అనే గ్యాంగ్‌స్టర్‌కు ప్రధాన అనుచరుడైన రాజు సేథిని హతమార్చాడు. ఇది సుపారీ హత్య అని, గుర్‌గ్రామ్‌కు చెందిన బీరేందర్ సింగ్ దైమా అలియాస్ బిందార్ గుజ్జర్ అనే వ్యక్తి ఈ సుపారీ ఇచ్చాడని పోలీసులు తెలిపారు. 2015లో దీపావళి రోజున ఓ పెట్రోలు బంకు దగ్గర సేథిని తుపాకితో కాల్చి చంపేశారు.
ఈ హత్య తర్వాత గుర్‌గ్రామ్‌లో గ్యాంగ్‌వార్ చెలరేగింది. ఆ తర్వాత 2016 ఫిబ్రవరిలో ఐదుగురు క్రైం బ్రాంచి అధికారులు గడోలిని ముంబై హోటల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. ఇందుకోసం బిందార్ గుజ్జర్ పోలీసులకు రూ. 5 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. ఈ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో నలుగురు పోలీసులను అరెస్టు చేశారు. అయితే, గుర్‌గ్రామ్‌లో జరిగిన ఓ రియల్ ఎస్టేట్ హత్యతో మళ్లీ సతీష్ మీద పోలీసుల దృష్టి పడింది. భరత్ భూషణ్ అనే ఆ వ్యాపారిని తన కార్యాలయం పక్కనే ఉన్న ఖాళీ ప్లాటులో పలురౌండ్లు కాల్చి మరీ చంపారు. ఆ ప్రాంతంలో సతీష్ ప్రభావం నానాటికీ పెరగడంతో పోలీసులు గట్టిగా దృష్టిసారించారు. అప్పుడే వాళ్లకు సతీష్, అతడి గ్యాంగు సభ్యులు హిస్సార్ సమీపంలోని హైబల్‌పూర్ గ్రామంలో గల ఓ పౌల్ట్రీ ఫాంలో దాగున్నట్లు తెలిసింది. దాంతో అక్కడ దాడిచేసి అందరినీ పట్టుకున్నట్లు గుర్‌గ్రామ్ కమిషనర్ సందీప్ ఖిర్వార్ తెలిపారు. సతీష్‌తో పాటు అతడి ప్రధాన అనుచరుడు అరవింద్ అలియాస్ పండిట్ కూడా పట్టుబడ్డాడు. ఇంకా నరేష్ అలియాస్ పహల్వాన్, సురేందర్ అలియాస్ ఫౌజీ, అశ్వని అలియాస్ పన్ను కూడా అరెస్టయినవారిలో ఉన్నారు. వాళ్ల దగ్గర రెండు నాటు రివాల్వర్లు, ఒక పిస్టల్, 30 బుల్లెట్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు.