
యోగి ఎఫెక్ట్.. డాన్‌ల ఆటలకు చెక్
లక్నో: సంచలన, కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో దూసుకెళ్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. జైళ్ల అధికారుల అవినీతిపై దృష్టి సారించారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న మాఫియా డాన్లకు అయినా చిన్నపాటి నేరస్తులకు అయినా ఒకే ఆహారం అందించాలని, ఖైదీలందరినీ ఒకేలా చూడాలని అధికారులను యోగి ఆదేశించారు. యూపీ హోం, జైళ్ల శాఖ, విజిలెన్స్ శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు.
గతంలో కొందరు డాన్‌లు, కరడుగట్టిన నేరస్తులు జైళ్లలో ఫోన్లు వాడుతున్నారని, ప్రత్యేక వసతులు పొందుతూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఆరోపణలు రావడంతో యోగి.. ఈ సమీక్ష సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ జైళ్లలో ఖైదీలందరినీ ఒకేలా చూడాలని, మొబైల్ ఫోన్ జామర్లను ఏర్పాటు చేయాలని ఆ శాఖ అధికారులను అదేశించారు. కరడుగట్టిన నేరగాళ్లపై ఎలాంటి దయ చూపవద్దని అధికారులను హెచ్చరించారు. పోలీసు శాఖలో అన్ని విభాగాల్లో అవినీతిని నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని, నేరగాళ్లు, సంఘ విద్రోహశక్తులతో సంబంధాలున్న అధికారులను గుర్తించాలని యోగి ఆదేశించారు.
యూపీ సీఎం యోగి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పుణ్యక్షేత్రాలున్న చోట మద్యం షాపులు, అమ్మకాలపై నిషేధం విధించారు.