భారీగా పడిన పసిడి, వెండి
న్యూయార్క్: అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు బలహీన ధోరణిలో ఉన్నాయి. గురువారం కడపటి సమాచారం అందేసరికి నెమైక్స్ కమోడిటీ డివిజన్‌లో ఔన్స్ (31.1 గ్రా) పసిడి కాంట్రాక్ట్ ధర 34 (2 శాతం) డాలర్లు తగ్గి, 1,330 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా 4 శాతం నష్టంతో 22 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇందుకు అనుగుణంగా దేశంలోని ఫ్యూచర్స్ మార్కెట్‌లో ధరలు కూడా కదులుతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో పసిడి 10 గ్రాముల ధర రూ.650 నష్టంతో రూ.30,032 వద్ద ట్రేడవుతుండగా, వెండి కాంట్రాక్ట్ 3 శాతం నష్టంతో (రూ. 1,765)రూ.50,675 వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ ఇదే ధోరణిలో నష్టాల్లో ముగిసి, శుక్రవారం డాలర్ మారకంలో రూపాయి బలపడితే స్పాట్ మార్కెట్‌లో పసిడి, వెండి (శుక్రవారం) ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది.