బంగారం, వెండి కళకళ
బంగారం, వెండి కళకళ
Published Fri, Oct 18 2013 12:34 AM | Last Updated on Fri, Sep 1 2017 11:44 PM
ముంబై: అటు అంతర్జాతీయంగా, ఇదే దేశీయంగా బంగారం, వెండి ధరలు గురువారం తళుక్కుమన్నాయి. దేశీయ స్పాట్ మార్కెట్ విషయానికి వస్తే- ఇక్కడ పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర క్రితం ముగింపుతో పోల్చితే రూ.365 పెరిగి రూ.31,120కి చేరింది. 22 క్యారెట్లకు సంబంధించి కూడా ధర కూడా ఇదే పరిమాణంలో పెరిగి రూ.30,970కి ఎగసింది. వెండి కేజీ ధర రూ. 670 ఎగసి రూ.49,000కు చేరింది. ‘ఫ్యూచర్స్’లో ఇలా...: కాగా గురువారం అంతర్జాతీయంగా నెమైక్స్- కమోడిటీ డివిజన్‌లో పసిడి ధర ఔన్స్ (31.1గ్రా)కు కడపటి సమాచారం అందేసరికి 40 డాలర్ల లాభంతో (3 శాతం) 1,322 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి కాంట్రాక్ట్ సైతం 2 శాతం లాభంతో 22 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
దీనిని అనుసరిస్తూ, దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల పసిడి ధర రూ. 605 (2 శాతానికి పైగా) లాభంతో రూ. 29,553 వద్ద ట్రేడవుతుండగా, వెండి కేజీ రూ. 728 లాభంతో (1.55 శాతం) రూ. 48,100 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణిలో ట్రేడింగ్ కొనసాగి, శుక్రవారం రూపాయి బలహీనపడితే దేశీయంగా స్పాట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా బంగారం వారం గరిష్ట స్థాయిలో ట్రేడవుతోంది. డాలర్ బలహీనత, రుణ పరిమితి పెంపునకు సంబంధించి .
కుదిరిన ఒప్పందం నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ సహాయక చర్యలు కొనసాగుతాయన్న విశ్వాసం బంగారం, వెండి సెంటిమెంట్‌ను బలపరుస్తున్నాయి. ఈ అంశాలకు తోడు దేశీయంగా పెళ్లిళ్లు, పండుగల సీజన్ బంగారం, వెండి ధరల పెరుగుదల కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. టారిఫ్‌ల తగ్గింపు: కాగా దేశీయంగా కస్టమ్స్ సుంకాల నిర్ణయానికి ప్రాతిపదిక అయిన బంగారం, వెండి టారిఫ్ విలువలను కేంద్ర ప్రభుత్వం గురువారం తగ్గించింది. దీని ప్రకారం బంగారం దిగుమతుల టారిఫ్ విలువ 10 గ్రాములకు 436 డాలర్ల నుంచి 418 డాలర్లకు తగ్గింది. వెండి కేజీ టారిఫ్ విలువ 702 డాలర్ల నుంచి 699 డాలర్లకు తగ్గింది.
Advertisement
Advertisement