నెట్ లేకుండా గూగుల్ నావిగేషన్
న్యూఢిల్లీ: సుపరిచిత ప్రాంతాల్లోనే అవసరమైన అడ్రస్ వెతకడం ఎంతో చికాకు, ప్రయాసతో కూడిన ప్రహసనం. ఇక అపరిచిత ప్రాంతాల్లో, ముక్కూ మొహం తెలియని చోట, దారి తెన్నూ కానరాని చోటకు అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లడం ఎంత కష్టమో అనుభవపూర్వకంగా అందరికి తెల్సిందే. గూగుల్ నావిగేషన్ యాప్ పుణ్యమా అంటూ అడవుల్లోని అడ్డదారుల్లో, దిక్కూ తెన్నూ తెలియని ఎడారి మార్గాన కూడా అవసరమైన చోటుకు ఇట్టే వెళ్లే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఈ సౌకర్యం భారత్ లాంటి దేశాల్లో ఇంటర్నెట్ సౌలభ్యంవున్న మొబైల్ ఫోన్లకు మాత్రమే పరిమితమైంది.
ఇక ముందు ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఈ సౌకర్యాన్ని మొబైల్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోని తెస్తున్నట్టు గూగుల్ సంస్థ తాజాగా ప్రకటించింది. ప్రస్తుత మార్కెట్ శక్తుల ట్రెండ్, నెట్ సిగ్నల్స్ అంతంత మాత్రంగా ఉన్న ప్రాంతాలను, నెట్ డాటాకు వినియోగదారుడికి అవుతున్న ఖర్చు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని త్వరలోనే అఫ్‌లైన్‌లో పని చేసే నావిగేషన్ యాప్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నామని ఆ సంస్థ ప్రకటించింది. గూగుల్ మాప్స్ యాప్ ద్వారా వాయిస్ బెస్డ్‌గా ఈ నావిగేషన్ పని చేస్తుందని, కొంతకాలం ఆన్‌లైన్‌లోను, ఆఫ్‌లైన్‌లోనూ పనిచేసే నావిగేషన్ వ్యవస్థ అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ ప్రకటించింది.
నెట్ సిగ్నల్స్ అందుబాటులోలేని మెట్రో రైళ్లలో, విమానాల్లో ప్రయాణించేవారికి, భూగర్భ గనుల్లో, పర్వత ప్రాంతాల్లో పనిచేసే వారకి ఈ ఆఫ్‌లైన్ నావిగేషన్ యాప్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని గూగుల్ నిపుణులు తెలియజేస్తున్నారు. గూగుల్ ఆఫ్‌లైన్ మాప్స్‌ను 2012లోనే 150 దేశాల్లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు మొబైల్ నావిగేషన్‌ను దానికి అనుసంధానించడమే తరువాయి.