హైదరాబాద్.. ఇంటింటా ఇంటర్‌నెట్ | Now, WIFI Services will be available in Hyderabad city | Sakshi
Sakshi News home page

హైదరాబాద్.. ఇంటింటా ఇంటర్‌నెట్

Published Wed, Jul 30 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 11:04 AM

హైదరాబాద్.. ఇంటింటా ఇంటర్‌నెట్

హైదరాబాద్.. ఇంటింటా ఇంటర్‌నెట్

ఇక హై(వై)ఫై
తొలి విడతగా వైఫై వచ్చే ప్రాంతాలు
  హైటెక్ సిటీ   
  మాదాపూర్   
  గచ్చిబౌలి
వీటితో పాటు వెస్ట్ జోన్‌లోని కొన్ని ప్రాంతాలు
మెట్రోపోలీస్ సదస్సుకు హాజరయ్యే విదేశీ ప్రతినిధులు విడిది చేసే హోటళ్లు, పర్యాటక ప్రాంతాలు

 
 వైఫై పనితీరు ఇలా..
 ‘వెర్లైస్ ఫెడిలిటీ’(వైఫై)... ఇప్పటివరకు లగ్జరీ హోటళ్లు, కార్పొరేట్ ఆఫీసులు, షాపింగ్ మాళ్లకే పరిమితమైన వైఫై సేవలు.. త్వరలో నగరం నడిబొడ్డున పొందొచ్చు. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఉంటే చాలు.. వైర్లతో పనిలేకుండా ఆన్‌లైన్‌లో ఉచితంగా విహరించొచ్చు. సెప్టెంబర్ కల్లా హైదరాబాద్‌లో వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో వైఫై కథాకమామిషేంటో  ఓ లుక్కేద్దాం రండి!
 
 ఇప్పటికే ప్రపంచదేశాల్లో గుర్తింపు పొందిన భాగ్యనగరం మరో మైలురాయిని దాటనుంది. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌ను కూడా వైఫై ఆధారిత నగరంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. దేశవ్యాప్తంగా 4జీ సేవల లెసైన్స్ పొందిన రిలయెన్స్ సంస్థ చేతికి పగ్గాలప్పగించింది. తొలి విడతలో.. హైదరాబాద్‌తో పాటు 6 కార్పొరేషన్లు, 37 మున్సిపాలిటీల్లో, రెండో విడతలో.. ఇతర పట్టణాలు, 220 మండల కేంద్రాల్లో, మూడో విడతలో రాష్ట్రమంతటా 4జీ సేవలు అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
 
 వై -ఫై అంటే..
 వైఫై అంటే.. వైర్‌లెస్ లోకల్ ఏరియా నెట్‌వర్క్ (డబ్ల్యూఎల్‌ఏఎన్). ఇది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ (ఐఈఈఈ) 802.11 స్టాండర్స్‌పై ఆధారపడి ఉంటుంది. వైఫై అంటే ైవెర్లైస్ ఫెడిలిటీ అన్నమాట. ఒక్క వైఫై టవర్ సిగ్నల్స్ ఇండోర్‌లో అయితే 20 మీటర్లు, ఔట్‌డోర్‌లో అయితే 100 మీటర్లు వరకు అందుతాయి. వైఫై సేవలను పొందాలంటే ఫోర్త్ జనరేషన్ (4జీ) ఉండాల్సిందే.
 
 సిగ్నల్స్ ఇలా..
 తీగల అవసరం లేకుండా నిర్ణీత పరిధిలో హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందడమే వైఫై. బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకున్న తర్వాత వైఫై రౌటర్ పరికరాన్ని అమర్చుతారు. ఈ పరికరం బ్రాడ్ బ్యాండ్ ద్వారా అందే ఇంటర్నెట్‌ను నిర్ణీత పరిధిలో వైఫై ఉన్న ఫోన్లు, కంప్యూటర్ల వంటి వాటికి ఇంటర్నెట్ సిగ్నల్‌ను అందిస్తా యి. మనం బ్లూటూత్ ద్వారా ఫోటోలు, పాటలు పంపినట్లే వై-ఫై ఇంటర్నెట్ సేవలను అందిస్తుందన్నమాట.
 
తొలి 6 నెలలు ఉచితం.. ఆపై నెలకు రూ.1,200
 తొలి విడతగా వైఫై సేవలను సచివాలయం, అసెంబ్లీ, జీహెచ్‌ఎంసీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోని కొన్ని ప్రాంతాలు, సైబరాబాద్ పరిధిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తదితర ప్రాంతాల్లో ఆరునెలల పాటు వైఫై ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మామూలుగా అయితే 4జీ కనెక్షన్‌కు చుట్టూ 4 కి.మీ. వరకు వైఫై అందుబాటులో ఉండే వీలున్నా.. పాస్‌వర్డ్ ఉన్నవారికి మాత్రమే అందుబాటులోకి వస్తుంది. అయితే ముందుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో అందరికీ ఉచితంగా వైఫై సేవల్ని అందిస్తారు. ఆ తర్వాత కనెక్షన్‌కు ప్రతినెలా రూ.1,200 వరకు చార్జీ వసూలు చేస్తారు.
 
ప్రయోజనాలనేకం..
 - ఇంటి పన్ను, విద్యుత్ బిల్లులు, లే-అవుట్ల అనుమతులు, జనన, మరణ ధృవీకరణ పత్రాల వంటి స్థానిక సర్టిఫికేట్లు వంటి సుమారు 15 రకాల ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్‌తో అనుసంధానం చేస్తారు. దీంతో వినియోగదారులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే ఉచితంగా పొందవచ్చు. దీంతో డబ్బుకు డబ్బు.. సమయానికి సమయం ఆదా అవుతుంది. ట్రాఫిక్ చిక్కులూ తప్పుతాయండోయ్.
- వైఫై సేవలతో ప్రపంచ దేశాల్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న దానికంటే ఇంటర్నెట్, ఫోన్ల పనితీరు ఎన్నో రెట్లు మెరుగవుతుంది.
 - వైఫై సౌకర్యం ఉన్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్ ఉంటేచాలు.. మొబైల్ డేటా నెట్‌వర్క్ లేకున్నా, వైఫై కనెక్టివిటీ ద్వారా ఇంటర్నెట్‌ను బ్రౌజింగ్ చేసే వీలుంటుంది. గల్లీ గల్లీల్లో నిలబడి కూడా ఈ-మెయిల్స్, ఫేస్‌బుక్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్‌ల్లో సర్ఫింగ్ చేయొచ్చు.
 - 4జీతో కేబుల్ కనెక్షన్లతో అవసరముండదు. ఆన్‌లైన్ ద్వారా ఒకే టీవీలో అన్ని చానళ్లు వీక్షించే వీలుంటుంది.
 - మొబైల్ ఫోన్‌లో మనం మాట్లాడే వ్యక్తులను చూసే వీలుంటుంది. దీనివల్ల ఒకరికొకరు దగ్గరగా ఉండి మాట్లాడుతున్నామనే అనుభూతి కలుగుతుంది.
 
 యూజర్ నేమ్, పాస్‌వర్డ్ తప్పనిసరి..
 వైఫై సేవలకు యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఉండాల్సిందే. ముందుగా వినియోగదారులు మొబైల్  నంబరు, ఈ-మెయిల్ ఐడీ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలు నమో దుచేసిన వెంటనే మొబైల్‌కు ఓటీపీ (వన్‌టైమ్ పాస్‌వర్డ్) వస్తుంది. ఈ పాస్‌వర్డ్‌ను ఉపయోగించి లాగిన్ కావచ్చు.
 
 ఇప్పటికే 500 కి.మీ. పూర్తి..
నగరంలో పూర్తి స్థాయి వైఫై సేవలకు 1,700 కి.మీ. మేర ఆప్లిక్ ఫైబర్ కేబుల్(ఓఎఫ్‌సీ) లైన్లు అవసరముంటుందని నిపుణు ల అంచనా. ఇప్పటికే రిలయెన్స్ 500 కి.మీ. మేర లైన్ల నిర్మాణం పూర్తి చేసింది. అయితే అక్టోబర్‌లో నగరంలో జరగనున్న మెట్రోపోలీస్ సదస్సు నాటికి కొన్ని ప్రాంతాల్లోనైనా వైఫై సేవలను ప్రారంభించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
 
 రోజుకు 3 గంటలు.. 50 ఎంబీ డేటా..
 రోజుకు 3 గంటల చొప్పున 50 ఎంబీ డేటా వరకు ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు. కచ్చితమైన డేటాలోని ఐఎంఈఐ నంబర్లున్న మొబైల్, ట్యాబ్, ల్యాప్‌టాప్‌లకు మాత్రమే వైఫై సేవలు పొందే వీలుంటుంది. ఒక రోజులో 3 గంటల సమయం దాటితే వైఫై కనెక్టివిటీ ఉండదు.
 
 దృష్టి పెట్టాల్సిందిక్కడే: టీ ఐటీ ఎంప్లాయిస్ జేఏసీసీ లక్ష్మారెడ్డి

-  ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అమలవుతున్న వైఫై విధి, విధానాలు, లోటు పాట్లను క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేయాలి. ఇందుకోసం ప్రత్యేకమైన సాంకేతిక నిపుణుల్ని నియమించాలి.
 - వైఫై కింద ప్రభుత్వ సేవలను ఉచితంగా అందించి, ప్రైవేటు సేవలను కొంత మొత్తంతో అందించాలి. దీంతో నగదు భారం కాసింత తగ్గుతుంది.
 - వైఫై ఉపయోగించుకునే వ్యక్తి ఎలాంటి మొబైల్, ల్యాప్‌టాప్ వాడుతున్నాడు, ఇంటర్నెట్‌లో ఏం చెక్ చేస్తున్నాడు, ఏం డౌన్‌లోడ్ చేస్తున్నాడు.. వంటి అనేక అంశాలపై సర్వీసు ప్రొవైడర్లు ఎప్పటిక ప్పుడు నిఘా వేయాలి.
 - సంఘ విద్రోహక శక్తుల చేతుల్లోకి వైఫై కనెక్టివిటీ వెళ్లకుండా సైబర్ క్రైమ్ టీంను బలోపేతం చేయాలి. నేరస్థులను కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలి.
 - కేవలం సమాచారాన్ని తెలుసుకునేందుకు, బ్రౌజింగ్, ఈ-మెయిల్స్ పంపించేందుకు మాత్రమే వైఫైని ఉచితంగా అందించాలి. వీడియో, ఆడియో స్ట్రీమింగ్, డౌన్‌లోడ్‌లను నియంత్రించాలి.
 - ఒకే సర్వర్‌పై ఎక్కువ గంటలు బ్రౌజింగ్ చేస్తే అక్కడి ఇంటర్నెట్ స్పీడ్ తగ్గడంతో పాటు, సర్వర్ కుప్పకూలే ప్రమాదముంది. పైగా స్థానిక వ్యాపారులు అపరిమితంగా వాడుకుని దుర్వినియోగం చేసే అవకాశముంది. ఈ అంశంపై దృష్టి సారించాలి.
 - సిటీ ఫ్లస్ ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement