ఎ-380.. ఇక టేకాఫ్ | Government finally allows foreign airlines to fly Airbus A-380 to India | Sakshi
Sakshi News home page

ఎ-380.. ఇక టేకాఫ్

Published Tue, Jan 28 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM

ఎ-380.. ఇక టేకాఫ్

ఎ-380.. ఇక టేకాఫ్


     ఎయిర్‌బస్ జంబో విమానాలకు మంత్రుల బృందం గ్రీన్‌సిగ్నల్...
     హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి రాకపోకలు
 
 
 న్యూఢిల్లీ: ఇప్పటివరకు విదేశాల్లో మాత్రమే కన్పించే అత్యంత సౌఖ్యవంతమైన ఎ-380 సూపర్ జంబో విమానాలు ఇకనుంచి భారతీయులకు కనువిందు చేయనున్నాయి. ఐదేళ్లుగా వీటి రాకపోకలపై ఉన్న నిషేధాన్ని భారత ప్రభుత్వం సోమవారం తొల గించింది. ఈ విమానాలను అనుమతించాలంటూ  సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఎమిరేట్స్, లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ కొన్నేళ్లుగా భారత్‌ను కోరుతున్నాయి. అతి పెద్ద బాడీతో, సుదూర ప్రయాణాలు చేయగల ఎ-380లను అనుమతిస్తే దేశీయ విమాన కంపెనీల ప్రయోజనాలకు విఘాతం కలగవచ్చని కేంద్రం గతంలో భావించింది.
 
 డీజీసీఏ, ఎయిర్ ఇండియా, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మధ్య కొన్ని వారాలుగా చర్చలు సాగిన నేపథ్యంలో... ఈ విమానాలపై ఆంక్షలు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి రాకపోకలకు తగిన మౌలిక సౌకర్యాలున్న హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఎయిర్‌పోర్టుల్లో మాత్రమే వీటిని అనుమతిస్తారు. ఈ నాలుగు విమానాశ్రయాలూ డీజీసీఏ సర్టిఫికేషన్ పొంది, సేవలకు తగిన సన్నాహకాలు పూర్తిచేయాల్సి ఉంది. ఆంక్షల ఎత్తివేత ప్రకటన వెలువడగానే ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌తో పాటు ఏ-380లను తయారు చేసే ఎయిర్‌బస్ సంస్థ హర్షం వ్యక్తం చేసింది. ఎ-380 విమానాలతో చార్జీలు తగ్గుతాయని కన్సల్టెన్సీ సంస్థ కేపీఎం జీ ఏరోస్పేస్ హెడ్ అంబర్ దూబే అభిప్రాయపడ్డారు.
 
 గతంలోనూ వచ్చిన ఎ-380 విమానాలు
 ఈ విమానాన్ని గతంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఎయిర్‌షోలో ప్రదర్శించారు. ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్టులకూ వెళ్లాయి. కొన్నేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన ఎ-380 విమానాన్ని అత్యవసర పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ల్యాండ్ చేశారు కూడా.
 
 ఎయిర్ ఇండియాకు సమస్యలు?
 ఎయిర్ ఇండియా కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న ఢిల్లీ ఎయిర్‌పోర్టులోకి ఎ-380 విమానాలను అనుమతించాలన్న నిర్ణయాన్ని పరిశ్రమ వర్గాలు ఆక్షేపిస్తున్నాయి. ఆధునిక బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాల ద్వారా వివిధ దేశాలకు సర్వీసును నిర్వహించాలనుకుంటున్న ఎయిర్ ఇండియాకు తాజా నిర్ణయం తో సమస్యలు ఏర్పడవచ్చని వ్యాఖ్యానిస్తున్నాయి.
 
 ఏ-380 ప్రత్యేకతలు ఇవీ..
   ఈ డబుల్ డెకర్ విమానంలో ఎకానమీ క్లాస్ మాత్రమే ఉంటే 850 సీట్లుంటాయి.
   మూడు తరగతులు (ఎకానమీ, బిజినెస్, ఫస్ట్ క్లాస్) ఉంటే 550-600 మంది ప్రయాణించొచ్చు.
   ఈ తరహా విమానాలున్న 10 అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌లో 9 సంస్థలు భారత్‌కు విమానాలు నడుపుతున్నాయి.
 
   ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 110కు పైగా ఎ-380 విమానాలు ప్రయాణిస్తున్నాయి.
   ఇవి ఇంధనాన్ని అతి తక్కువగా వినియోగించుకుంటాయనీ, ఒకో సీటు నిర్వహణ వ్యయం అతి తక్కువని ఎయిర్‌బస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ రావు చెప్పారు.

Advertisement

పోల్

Advertisement