కెన్యాలో నివసించే భారతీయ సమాజం రక్షణ కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని గుజరాతీయులు అభిప్రాయపడ్డారు. కెన్యా రాజధాని నైరోబీలో వెస్ట్గేట్ షాపింగ్ మాల్లో చోటు చేసుకున్న ఘటనలో గుజరాతీయుల మరణం పట్ల వారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంగళవారం గుజరాత్ లోని గాంధీనగర్లో మృతుల స్మృత్యర్థం ఏర్పాటు చేసిన స్మారక సభలో పలువురు పాల్గొని ప్రసంగించారు. వెస్ట్మాల్ ఘటనలో భారతీయులు మరణించిన సంఘటన తమను తీవ్రంగా కలచి వేసిందని తెలిపారు.
ఆ సంఘటనలో మృతి చెందిన ఆరుగురు భారతీయుల్లో ముగ్గురు గుజరాత్ ప్రాంతం నుంచి వెళ్లిన వారేనని వారు చెప్పారు. గతంలో గుజరాత్ నుంచి వేలాది మంది వ్యాపారం చేసుకునేందుకు కెన్యా వలస వెళ్లారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. వారి రక్షణ కోసం తగు చర్యలు తీసుకోవాలని కెన్యా ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. అలాగే కెన్యాలోని గుజరాతీ సమాజానికి మరింత రక్షణ కల్పించాలని కోరుకుంటున్నారని వారు అభిప్రాయపడ్డారు.
కెన్యాలో ఇటీవల తరచుగా చోటు చేసుకుంటున్న దాడులతో స్థానికంగా నివసిస్తున్న గుజరాతీయులు కలత చెందుతున్నారని వివరించారు. ఇప్పటికే చాలా మంది గుజరాతీయులు అలా స్వస్థలాలకు చేరుకున్నారని వారు తెలిపారు. కెన్యా అభివృద్ధిలో గుజరాతీయులు కీలక పాత్ర పోషించారని చెప్పారు. వెస్ట్మాల్ షాపింగ్ మాల్పై తీవ్రవాదుల దాడిని గుజరాతీ సమాజం ముక్త కంఠంతో ఖండించింది. కెన్యా రాజధాని నైరోబీలో శనివారం వెస్ట్మాల్ ఘటనలో 63 మంది మరణించిన సంగతి తెలిసిందే.