కిరణ్‌ది అత్యంత దుర్మార్గమైన పాలన: హరీష్‌రావు
సంగారెడ్డి, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన రాష్ట్ర చరిత్రలోనే అత్యంత దుర్మార్గమైందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ధ్వజమెత్తారు. మెదక్ జిల్లాలో సోమవారం పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిరణ్ పాలనను తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో ఏదీ కొనలేక, తినలేక ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారని చెప్పారు.
ఆయన పాలన మూడేళ్ల కాలం దినదిన గండంగా గడిచిందని విమర్శించారు. తెలంగాణ ప్రజల కష్టాలను ఏమాత్రం పట్టించుకోని కిరణ్.. సొంత జిల్లా చిత్తూరుకు మాత్రం రూ.6వేల కోట్లు మంజూరు చేసుకుని తన అనుయాయులకు ఫలహారంగా పంచి పెడుతున్నారని మండిపడ్డారు. అయినా ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం నోరు మెదపడంలేదని, ఆ నిధుల్లో ఆయన వాటా ఎంతో చెప్పాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రచ్చబండ కార్యక్రమం తెలంగాణలో రచ్చరచ్చ అవుతోందన్నారు. అమ్మహస్తం పథకంలో కిరణ్ బొమ్మలు తప్ప సరుకులు లేవని ఎద్దేవా చేశారు.
సీఎం పదవికే కళంకం తెచ్చాడు: కేటీఆర్
సిరిసిల్ల: ప్రజాధనంతో నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమాన్ని కిరణ్‌కుమార్ రెడ్డి దుర్వినియోగం చేస్తూ, సీఎం పదవికే కళంకం తెస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు విమర్శించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం రగుడులో సోమవారం రచ్చబండలో ఆయన మాట్లాడారు.