ఆర్ట్ మార్కెట్ అదుర్స్..! | Has the Indian art market hit an inflection point? | Sakshi
Sakshi News home page

ఆర్ట్ మార్కెట్ అదుర్స్..!

Published Thu, Jan 16 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM

ఆర్ట్ మార్కెట్ అదుర్స్..!

ఆర్ట్ మార్కెట్ అదుర్స్..!

 ఆ హాల్ అంతా గుండుసూది పడినా వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది. అక్కడ కూర్చున్నవాళ్లలో కోట్లకు పడగలెత్తిన అపర కుబేరులున్నారు. టాప్ కార్పొరేట్ల నుంచి బడా వ్యాపారవేత్తలకూ కొదవలేదు. అంతేకాదు ఖరీదైన సూట్లు, కళ్లు చెదిరే వజ్రాభరణాలతో అక్కడికి వచ్చినవాళ్లతో మెరిసిపోతోంది ఆ ప్రదేశం. అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. ఇంతలో ఒక వ్యక్తి రూ.12.5 కోట్లు అంటూ చెయ్యెత్తాడు. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా! భారతీయ చిత్రకారుడు గీసిన పెయిం టింగ్‌కు వేలంలో పలికిన తొలి బిడ్ ఇది. ప్రపంచప్రఖ్యాత వేలం సంస్థ ‘క్రిస్టీస్’ ఇటీవలే భారత్‌లో నిర్వహించిన తొలి వేలం బంపర్ సక్సెస్‌కు ఇది నిదర్శనం. మన ఆర్ట్ మార్కెట్ భవిష్యత్తు మరింత వర్ణ రంజితంగా మారనుందనేందుకు ఈ స్పందనే తార్కాణమని పరిశీలకులు చెబుతున్నారు.
 
 వాసుదేవ్ గయ్‌తోండే గీసిన 60x40 అంగుళాల ఆయిల్ పెయింటింగ్‌కు క్రిస్టీస్ వేలంలో ధర అంతకంతకూ పెరుగుతూపోయింది. అసలు ఈ సంస్థ ఊహించిన ధరకు తొలి బిడ్ రెట్టింపు కావడం గమనార్హం. కొద్ది నిమిషాల్లోనే ఒక వ్యక్తి రూ.18 కోట్లకు పైగా బిడ్‌ను వేశాడు. మరిన్ని చేతులు వేలంలో పైకిలేచాయి. వేలం ధర పెంచేందుకు పోటీపడ్డారు. దీంతో నిశ్శబ్దం పటాపంచలై సందడి వాతావరణం నెలకొంది. చూస్తుండగానే ఈ ‘అన్‌టైటిల్డ్’ ఆయిల్ ఆన్ కాన్వాస్ చిత్రానికి రేటు రూ. 19 కోట్లను దాటింది. చివరకు ఏడు నిమిషాల పోటాపోటీ బిడ్డింగ్ అనంతరం రూ.23.7 కోట్లకు ఈ పెయింటింగ్ అమ్ముడుపోయింది.
 
 పసిడి వర్ణంలో ఉన్న ఈ ల్యాండ్‌స్కేప్‌ను ఆయన 1979లో చిత్రించారు(2001లో గయ్‌తోండే మరణించారు). అమెరికాకు చెందిన ఒక ప్రైవేటు ఆర్ట్ కలెక్టర్(ప్రముఖ ఆర్టిస్ట్‌ల చిత్రకళా ఖండాలను సేకరించే వ్యక్తి) దీన్ని ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించి చేజిక్కించుకున్నాడు. రూపాయల్లో చూస్తే వేలంలో ఒక భారతీయ ఆర్టిస్ట్ చిత్రానికి లభించిన అత్యధిక మొత్తంగా దీన్ని పేర్కొంటున్నారు. తయెబ్ మెహతా ‘మహిషాసుర’ చిత్రం(ఎక్రలిక్ ఆన్ కాన్వాస్-ఈ సిరీస్‌లో ఒక పెయింటింగ్) రూ.19.7 కోట్లకు అమ్ముడై వేలంలో రెండో స్థానంలో నిలిచింది. ఇంకా ఈ వేలంలో విఖ్యాత ఆర్టిస్ట్ ఎంఎఫ్ హుస్సేన్‌తో పాటు రవీంద్రనాథ్ ఠాగూర్, అవనీంద్రనాథ్, అమృతా షెర్గిల్, మంజిత్ బవా, ఎస్‌హెచ్ రజా, అర్పితా సింగ్ వంటి దిగ్గజ చిత్రకారుల పెయింటింగ్‌లు సైతం కొలువుతీరాయి.
 
 కార్పొరేట్ల హల్‌చల్...
 ముంబైలోని తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్‌లోని ప్రత్యేక ప్రదేశం(క్రిస్టల్ రూమ్)లో ఈ కళాఖండాల వేలం జరిగింది. ఇందులో పాల్గొనేందుకు వచ్చినవాళ్లు ధరించిన దుస్తులు, అత్యంత ఖరీదైన నగలు.. పెయింటింగ్‌లలోని రంగులతో పోటీపడ్డాయి. ఆర్ట్ కలెక్టర్లు, కార్పొరేట్ దిగ్గజాలు ఒకరితోఒకరు మమేకమై అక్కడి చిత్రరాజాల గురించి చర్చల్లో మునిగితేలారు. ప్రధానంగా ఇక్కడ ఆందరి దృష్టినీ ఆకర్షించినవాళ్లలో ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంకా ఒకరు. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ అధినేత సజ్జన్ జిందాల్ భార్య సంగీతా జిందాల్, ఆమె కుమార్తె; సిటీ ఇండియా సీఈవో ప్రమిత్ ఝవేరి భార్య ముకీతా ఝవేరి కూడా అతిథుల్లో ఉన్నారు. ఢిల్టీ ఆర్ట్ గ్యాలరీ యజమాని ఆశిష్ ఆనంద్ సహా దేశంలో పేరొందిన పలు ఆర్ట్ గ్యాలరీల చీఫ్‌లు సైతం ఈ వేలానికి తరలివచ్చారు. మొత్తంమీద భారతీయ చిత్రకారులు, చిత్రకళలపై పెరుగుతున్న మక్కువ... ఇక్కడి ఆర్ట్ మార్కెట్‌కు సానుకూలాంశమని పరిశీలకులు చెబుతున్నారు.
 
 అంచనాలకు రెట్టింపు...
 లండన్‌కు చెందిన క్రిస్టీస్.. ముంబై వేలంలో 1.54 కోట్ల డాలర్ల(దాదాపు రూ. 95 కోట్లు) విలువైన పెయింటింగ్‌లు, కళాఖండాలను విక్రయించింది. ఇది ఆ సంస్థ అంచనా వేసిన మొత్తంకంటే రెట్టింపునకు పైనే. అంతక్రితం షాంఘై వేలంలో క్రిస్టీస్ 2.5 కోట్ల డాలర్ల విలువైన నగలు, శిల్పాలు, వాచీలను విక్రయించింది.  ‘వేలంలో పాల్గొన్నవారిలో ఆసక్తి, జోష్‌తో అనూహ్య విజయం సాధించాం. వచ్చే డిసెంబర్ కంటే ముందే భారత్‌లో మళ్లీ వేలం నిర్వహించాలన్నంత ఆసక్తి మాలో నింపింది. విదేశాల నుంచి కూడా ఇక్కడికి భారీ సంఖ్యలో క్లయింట్లు తరలిరావడం, ఫోన్‌లతోనూ బిడ్డింగ్‌లో పాల్గొనడం గమనించదగ్గ అంశం’ అని క్రిస్టీస్ సీఈవో స్టీవెన్ మర్ఫీ వ్యాఖ్యానించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement