న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ తొలినాళ్లలో తయారు చేసిన కంప్యూటరు అమ్మకానికి వస్తోంది. మే 16 నుంచి 24 దాకా ఆన్‌లైన్‌లో నిర్వహించే వేలంలో క్రిస్టీస్ సంస్థ దీన్ని విక్రయిస్తోంది. దీని ధర 4,00,000– 6,50,000 డాలర్ల దాకా (సుమారు రూ. 2.81 కోట్ల నుంచి రూ. 4.56 కోట్ల దాకా) పలకవచ్చని అంచనా వేస్తున్నారు. 1976లో యాపిల్ తొలి విడతలో తయారు చేసిన 200 యాపిల్–1 కంప్యూటర్స్‌లో ప్రస్తుతం కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటిల్లో ఒకటి ఇప్పుడు వేలానికొచ్చింది. యాపిల్ సహ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్ దీన్ని రూపొందించారు.
‘అప్పట్లో సుమారు 200 యాపిల్–1 కంప్యూటర్స్‌ను తయారు చేశారు. 666.66 డాలర్ల ధరకు విక్రయించారు. 1977లో రేటును 475 డాలర్లకు తగ్గించారు. అదే ఏడాది ఆఖరు నాటికి యాపిల్– ఐఐ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆ తర్వాత నుంచి యాపిల్–1 అమ్మకాలను నిలిపివేశారు‘ అని క్రిస్టీస్ సంస్థ పేర్కొంది. 1977 అక్టోబర్‌లో యాపిల్–1 అమ్మకాలను నిలిపివేసిన తర్వాత వాటిని కొనుక్కున్న వారు తిరిగి ఇస్తే కొంత డిస్కౌంటుతో కొత్త కంప్యూటర్‌ను కొనుగోలు చేసే ఆఫర్లను యాపిల్ ప్రకటించింది. అలా తిరిగొచ్చిన వాటిలో చాలామటుకు కంప్యూటర్స్ ధ్వంసం కాగా.. యాపిల్–1 కంప్యూటర్స్‌లో సుమారు సగం మాత్రమే మిగిలాయి. వీటినే క్రిస్టీస్ ప్రస్తుతం అమ్మకానికి తెస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment