e acution
-
ICC auction: అసంబద్ధ వేలంలో పాల్గొనలేం
ముంబై: భారత్‌లో ఐసీసీ టోర్నమెంట్ల ప్రసార హక్కుల కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలక్ట్రానిక్ వేలం (ఇ–వేలం) నిర్వహించేందుకు ప్రముఖ ప్రసారకర్తల నుంచి టెండర్లు ఆహ్వానించింది. అయితే ఇ–వేలం ప్రక్రియకు సంబంధించిన పత్రాల్లో అస్పష్టమైన వివరాలే ఉన్నాయని, ఇలాంటి అసంబద్ధ టెండర్ల ప్రక్రియలో పాల్గొనలేమని భారతీయ బ్రాడ్కాస్టర్లు డిస్నీ–స్టార్, వయాకామ్–18, సోనీ, జీ నెట్వర్క్ సంస్థలు ఐసీసీకి లేఖ రాశాయి. టెండర్ల పత్రాల్లో పొందుపరిచిన అంశాల్లో మరింత స్పష్టత కావాలని లేఖలో కోరింది. ఇంచుమించు నాలుగు బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు కూడా ఒకే రకంగా స్పందించాయి. ‘నాలుగు ప్రసారకర్తలు తమ అభ్యంతరాలను తెలుపుతూ ఐసీసీకి లేఖ రాశా యి. అమెజాన్ సంస్థ ఇందులో ఎలా ముందుకెళుతుందో అర్థం కావట్లేదు. స్పష్టతలేని అంశాలతో ఆ సంస్థ సంతృప్తిగా ఉందా లేదో తెలియదు. అలాంటపుడు ఆ సంస్థ ఎందుకంత ఉత్సాహంగా ముందకెళుతుందో మరి! మేం అయితే ఇప్పుడున్న టెండర్ల ప్రక్రియపై అసంతృప్తితో ఉన్నాం. బిడ్లు దాఖలు చేయలేం’ అని ఓ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ అధికారి తెలిపారు. ఐసీసీ కమిటీ మీటింగ్‌లలో పాల్గొనే భారత క్రికెట్ నియంత్రన మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా బ్రాడ్కాస్టర్లకు మరింత సమాచారం ఇవ్వాలని ఐసీసీని కోరినట్లు తెలిసింది. ఐపీఎల్ మీడియా హ క్కుల కోసం బీసీసీఐ నిర్వహించిన ఇ–వేలం ప్రక్రియను అనుసరించేందుకు ఐసీసీ ఆసక్తిచూపడం లేదు. -
అమ్మకానికి తొలి యాపిల్ కంప్యూటర్
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ తొలినాళ్లలో తయారు చేసిన కంప్యూటరు అమ్మకానికి వస్తోంది. మే 16 నుంచి 24 దాకా ఆన్లైన్లో నిర్వహించే వేలంలో క్రిస్టీస్ సంస్థ దీన్ని విక్రయిస్తోంది. దీని ధర 4,00,000– 6,50,000 డాలర్ల దాకా (సుమారు రూ. 2.81 కోట్ల నుంచి రూ. 4.56 కోట్ల దాకా) పలకవచ్చని అంచనా వేస్తున్నారు. 1976లో యాపిల్ తొలి విడతలో తయారు చేసిన 200 యాపిల్–1 కంప్యూటర్స్‌లో ప్రస్తుతం కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటిల్లో ఒకటి ఇప్పుడు వేలానికొచ్చింది. యాపిల్ సహ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్ దీన్ని రూపొందించారు. ‘అప్పట్లో సుమారు 200 యాపిల్–1 కంప్యూటర్స్‌ను తయారు చేశారు. 666.66 డాలర్ల ధరకు విక్రయించారు. 1977లో రేటును 475 డాలర్లకు తగ్గించారు. అదే ఏడాది ఆఖరు నాటికి యాపిల్– ఐఐ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆ తర్వాత నుంచి యాపిల్–1 అమ్మకాలను నిలిపివేశారు‘ అని క్రిస్టీస్ సంస్థ పేర్కొంది. 1977 అక్టోబర్‌లో యాపిల్–1 అమ్మకాలను నిలిపివేసిన తర్వాత వాటిని కొనుక్కున్న వారు తిరిగి ఇస్తే కొంత డిస్కౌంటుతో కొత్త కంప్యూటర్ను కొనుగోలు చేసే ఆఫర్లను యాపిల్ ప్రకటించింది. అలా తిరిగొచ్చిన వాటిలో చాలామటుకు కంప్యూటర్స్ ధ్వంసం కాగా.. యాపిల్–1 కంప్యూటర్స్‌లో సుమారు సగం మాత్రమే మిగిలాయి. వీటినే క్రిస్టీస్ ప్రస్తుతం అమ్మకానికి తెస్తోంది. -
తలనీలాల ద్వారా రూ.173 కోట్ల ఆదాయం
తిరుమల: ఏడుకొండలవాడికి మొక్కుల రూపంలో భక్తులు సమర్పించుకుంటున్న తలనీలాలు టీటీడీకి కాసులు కురిపిస్తున్నాయి. భక్తుల తలనీలాల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.173.19 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది మే 15న నిర్వహించిన ఈ వేలంలో 40 టన్నుల తలనీలాలకు రూ.40.39 కోట్ల ఆదాయం లభించింది. సెప్టెంబరు 18న వేలం ద్వారా 42 టన్నులకు రూ.63.12 కోట్లు, డిసెంబర్ 24న 18 టన్నులకు రూ.50.48 కోట్ల ఆదాయం సమకూరింది. తాజాగా ఈ నెల 6న 10 టన్నులకు రూ.19.2 కోట్ల రాబడి వచ్చింది. ఆరు రకాలుగా ఉండే తలనీలాల్లో... 10 అంగుళాలుండే మూడో రకం, తుక్కుగా పరిగణించే ఐదో రకం అమ్మకం తగ్గింది. దీనివల్ల టీటీడీ వద్ద సుమారు 250 టన్నుల తలనీలాలు ప్రస్తుతం పేరుకుపోయాయి. దీంతో వీటి అమ్మకాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తలనీలాలు భద్రపరచటం, శుద్ధి చేసేందుకు వీలుగా రూ.6 కోట్ల వ్యయంతో తిరుపతిలో ప్రత్యేకంగా గోదామును నిర్మిస్తున్నారు.