తిరుమల: ఏడుకొండలవాడికి మొక్కుల రూపంలో భక్తులు సమర్పించుకుంటున్న తలనీలాలు టీటీడీకి కాసులు కురిపిస్తున్నాయి. భక్తుల తలనీలాల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.173.19 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది మే 15న నిర్వహించిన ఈ వేలంలో 40 టన్నుల తలనీలాలకు రూ.40.39 కోట్ల ఆదాయం లభించింది. సెప్టెంబరు 18న వేలం ద్వారా 42 టన్నులకు రూ.63.12 కోట్లు, డిసెంబర్ 24న 18 టన్నులకు రూ.50.48 కోట్ల ఆదాయం సమకూరింది. తాజాగా ఈ నెల 6న 10 టన్నులకు రూ.19.2 కోట్ల రాబడి వచ్చింది. ఆరు రకాలుగా ఉండే తలనీలాల్లో... 10 అంగుళాలుండే మూడో రకం, తుక్కుగా పరిగణించే ఐదో రకం అమ్మకం తగ్గింది. దీనివల్ల టీటీడీ వద్ద సుమారు 250 టన్నుల తలనీలాలు ప్రస్తుతం పేరుకుపోయాయి. దీంతో వీటి అమ్మకాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తలనీలాలు భద్రపరచటం, శుద్ధి చేసేందుకు వీలుగా రూ.6 కోట్ల వ్యయంతో తిరుపతిలో ప్రత్యేకంగా గోదామును నిర్మిస్తున్నారు.