ఐటీ రిటర్న్ లేటయితే? | Haven't filed tax return? | Sakshi
Sakshi News home page

ఐటీ రిటర్న్ లేటయితే?

Published Sun, Apr 5 2015 1:27 AM | Last Updated on Tue, Oct 2 2018 4:01 PM

ఐటీ రిటర్న్ లేటయితే? - Sakshi

ఐటీ రిటర్న్ లేటయితే?

 లేట్ రిటర్నులు ఒకసారి ఫైల్ చేశాక వాటిల్లో మార్పులు చేయడానికి అవకాశం ఉండదు. వ్యాపారం లేదా ట్రేడింగ్‌లో ఏమైనా నష్టాలు చూపిస్తే వాటిని రానున్న సంవత్సరాలకు కొనసాగించే వీలుండదు. ఈ అసెస్‌మెంట్ ఇయర్ (2015-16) రిటర్నులను మార్చి 31, 2016లోగా దాఖలు చేయకపోతే రూ.5,000 పెనాల్టీ విధించే అవకాశం ఉంది. పాత రిటర్నులకు సంబంధించి ఏమైనా పన్ను చెల్లించాల్సి ఉంటే దానిపై వడ్డీ భారం పడుతుంది.
 
 ఓ బహుళజాతి సంస్థలో పనిచేసే కృష్ణమోహన్ ఇంటి రుణం కోసం బ్యాంకులో దరఖాస్తు చేశాడు. రుణం మంజూరు చేయడానికి బ్యాంకు అధికారులు గడిచిన మూడేళ్ళ ఆదాయపు పన్ను రిటర్నులు అడిగారు. కానీ కృష్ణ మోహన్ గత మూడేళ్ళుగా రిటర్నులు వేయటం లేదు. వార్షిక ఆదాయం రూ.4,00,000 ఉన్నా... పొదుపు పథకాలు, ఇతర మినహాయింపులు చూపించడం ద్వారా ఒక్క రూపాయి పన్ను కూడా చెల్లించే అవసరం రావటం లేదు. జీతంలో పన్ను కోతలూ లేవు. దీంతో రిటర్నులు దాఖలు చేయలేదు. ఇప్పుడు రుణం తీసుకోవడానికి అదే సమస్యగా తయారయింది. పన్ను కట్టేశాం కదా... ఆఫీసులో ఎలాగూ కోత కోశారు కదా!! ఇక రిటర్నులతో పనేముంది? అనుకునేవారికీ ఇదే సమస్య. అసలు ఆదాయపు పన్ను రిటర్నుల విషయంలో చట్టాలు ఏం చెపుతున్నాయి? రిటర్నులు దాఖలు చేయకపోతే జరిగే నష్టమేంటి? ఇవన్నీ తెలియజేసేదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం...
 
 ఆదాయపు పన్ను మినహాయింపు బేసిక్ లిమిట్ రూ.2.5 లక్షలు. మీ మొత్తం వార్షికాదాయం కనక రూ.2.5 లక్షలు దాటితే తప్పనిసరిగా రిటర్నులు దాఖలు చెయ్యాలి. ఒకవేళ విదేశాల్లో ఆస్తులుంటే మా త్రం ఆదాయంతో సంబంధం లేకుండా రిటర్నులు దాఖలు చేసి తీరాలి. అయితే విదేశాల్లో ఆస్తులున్న వారు, వార్షికాదాయం రూ.10 లక్షలు దాటిన వారు  ఆన్‌లైన్ ద్వారా మాత్రమే రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. వీరంతా 2014-15కు సంబంధించి జూలై 31, 2015లోగా రిటర్నులు వేయాలి.
 
 గడువులోగా వేయకపోతే...
 పన్ను సకాలంలో చెల్లించినా రిటర్నులు మాత్రం ఆలస్యంగా దాఖలు చేస్తే కొన్ని సందర్భాల్లో పెనాల్టీలు పడే అవకాశం ఉంటుంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సకాలంలో దాఖలు చేసినవారికి కలిగే కొన్ని ప్రయోజనాలను ఇలా ఆలస్యంగా వేసినవారు కోల్పోతుంటారు. సకాలంలో దాఖలు చేయని వాటిని లేట్ రిటర్నులుగా భావిస్తారు. అంటే గడిచిన ఆర్థిక సంవత్సరానికి - ప్రస్తుత అసెస్‌మెంట్ ఇయర్‌కి అన్ని ప్రయోజనాలు పొందాలంటే జూలై 31లోగా రిటర్నులు దాఖలు చేయాలి. ఇలా సకాలంలో వేస్తే రిటర్నుల్లో గనక ఏమైనా తప్పులు దొర్లితే మార్చుకోవడానికి తగినంత సమయం ఉంటుంది. కొన్ని ఆదాయవ్యయాలు చూపించకపోతే వాటిని సవరిస్తూ ఎన్నిసార్లైనా రివైజ్డ్ రిటర్నులు దాఖలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
 
 అదే గడువు ముగిసిన తర్వాత రిటర్నులు దాఖలు చేస్తే ఇక రివైజ్డ్ వేయడానికి వీలుండదు. ఇంకో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే.. సకాలంలో రిటర్నులు దాఖలు చేస్తే స్వలకాలిక, దీర్ఘకాలిక మూలధన నష్టాలను రానున్న సంవత్సరాల్లో చూపించుకొని పన్ను భారం తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు 2014-15లో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో నష్టాలు వస్తే వీటిని మీరు ఎనిమిదేళ్ళు... అంటే 2022-23 వరకు చూపించుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగాక గడువు దాటాక రిటర్ను వేస్తే మూలధన నష్టాలను మరుసటి సంవత్సరాల్లో చూపించుకునే అవకాశాన్ని కోల్పోతారు.
 
 ఎన్నాళ్ళవి వేయొచ్చు?
 రెండు మూడు సంవత్సరాలవి కలిపి ఒకేసారి రిటర్నులు దాఖలు చేయొచ్చు. రెండేళ్ళ పాత ఆర్థిక సంవత్సరాలవైతే నేరుగా ఆన్‌లైన్‌లోనే దాఖలు చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ సంవత్సరాలవి అయితే మాత్రం ఫిజికల్ రూపంలో దాఖలు చేయా ల్సి ఉంటుంది. ఇలా ఫిజికల్ రూపంలో దాఖలు చేసే రిటర్నులకు అనుమతిచ్చే అంశం డిపార్ట్‌మెంట్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇలాంటి వాటి విషయంలో పెనాల్టీలు కూడా విధించే అవకాశం ఉంది. ఇలా లేట్‌గా దాఖలు చేసే రిటర్నుల విషయంలో మాత్రం నిపుణుల సలహా తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకసారి రిటర్నులు దాఖలు చేసిన తర్వాత తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉండదు. అందుకే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని తప్పులు లేకుండా దాఖలు చేయాల్సి ఉంటుంది.
 - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement