భార్యను ముక్కలు చేసి.. ఊరంతా వేశాడు!
సాధారణంగా హత్య జరిగిందంటేనే ఉలిక్కిపడతాం. కానీ రాజస్థాన్‌లోని అల్వార్ వాసులకు గత వారం రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేసిన ఓ హత్య తాలూకు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. దీపావళి రోజు నుంచి వరుసగా నగరంలోని పలు కాలనీలలో ఒక మహిళ శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా, కాలిపోయిన స్థితిలో ప్లాస్టిక్ బ్యాగ్‌లలో కనిపిస్తూ నగరవాసులను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. నాలుగు రోజుల్లో పోలీసులకు ఇలాంటివి ఏడు శరీర భాగాలు దొరికాయి. అన్నింటిలోనూ వాళ్లకు కనిపించిన అంశం ఒక్కటే. వాటిని ముక్కలు ముక్కలుగా చేసి, కాల్చేసి, తర్వాత బ్యాగులలో కుక్కారు.
అక్టోబర్ 30వ తేదీ.. దీపావళి రోజున అల్వార్ ఆర్యనగర్ ప్రాంతంలో ఓ మహిళ కుడిపాదం ప్లాస్టిక్ బ్యాగ్‌లో దొరికింది. తర్వాతిరోజు రెండు వేర్వేరు బ్యాగులలో రెండు చేతులు కనిపించాయి. ఏడో రోజున చిట్టచివరిగా... మహిళ తల మరో బ్యాగ్‌లో మరో కాలనీలో కనిపించింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే హంతకుడు కూడా నివసిస్తూ ఉండాలని పోలీసులు అనుమానించారు. దాంతో ప్రతి ఇల్లూ గాలించగా.. 35 ఏళ్ల యోగేష్ మల్హోత్రా అనే వ్యక్తిని అనుమానితుడిగా భావించి అదుపులోకి తీసుకున్నారు.
దీపావళి రోజు నుంచి అతడి భార్య కనిపించడం లేదు. ఆరోజు వాళ్ల ఇంట్లో ఏదో గొడవ జరిగిందని, అప్పటి నుంచి ఆర్తి కనిపించట్లేదని చుట్టుపక్కల వాళ్లు చెప్పినట్లు అల్వార్ ఎస్పీ రాహుల్ ప్రకాష్ తెలిపారు. దాంతో వెంటనే యోగేష్ మల్హోత్రా మీద నిఘా ఉంచారు. అతడి చేతుల మీద కాలిన గుర్తులున్నాయి. పోలీసులు ఆ ప్రాంతంలో గాలిస్తుండగానే అతడు ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయాడు. గత కొన్ని రోజలుగా ఇంట్లోంచి ఏవో బ్యాగులు తీసుకుని బయటకు వెళ్తున్నాడని ఇరుగుపొరుగు వారు చెప్పారు. చివరకు హిస్సార్‌లో దాగున్న అతడిని పోలీసులు అరెస్టుచేశారు.
తన భార్య శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసింది తానే గానీ, తాను ఆమెను చంపలేదని.. ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు చెప్పాడు. తనకు ఏదైనా అయితే తన కూతుర్ని ఎవరు చూసుకుంటారన్న బయంతో శరీరాన్ని ముక్కలుగా చేసి పారేయాలనుకున్నానని తెలిపాడు. కానీ పోలీసులు మాత్రం అతడి వాదనను నమ్మడం లేదు. ఆర్తికి వేరే వారితో వివాహేతర సంబంధం ఉందని అతడు అనుమానించడమే హత్యకు కారణం అయి ఉంటుందని భావిస్తున్నారు.