లక్ష్మీదేవి (ఫైల్)
శెట్టూరు( అనంతపురం): వ్యసనం.. ఓ కుటుంబంలో కార్చిచ్చు రేపింది. మద్యానికి బానిసైన భర్తలో మార్పు తీసుకువచ్చేందుకు ఆ ఇల్లాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకు మద్యం మహమ్మారి కబంధ హస్తాల్లో చిక్కుకున్న భర్త చేతిలోనే దారుణ హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన మేరకు...
చింతలేని కుటుంబం..
శెట్టూరు మండలం పెరుగుపాళ్యం గ్రామానికి చెందిన చిన్న నరసింహప్ప... చిన్నకారు రైతు. కొన్నేళ్ల క్రితం కర్ణాటక ప్రాంతానికి చెందిన గొల్ల లక్ష్మీదేవితో ఆయనకు వివాహమైంది. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న వీరికి ముగ్గురు కుమారులు. వీరిలో ఇద్దరికి వివాహమైంది. కుమారులు ముగ్గురూ బెంగళూరులోని గార్మెంట్స్ పరిశ్రమలో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే స్థిరపడ్డారు. వ్యవసాయంతో పాటు పాడి పోషణ చేపట్టి కుటుంబ బాధ్యతలను లక్ష్మీదేవి చూసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో నరసింహప్ప మద్యానికి బానిసయ్యాడు.
తరచూ గొడవ..
మద్యానికి బానిసైన నరసింహప్ప ఎలాంటి పనులు చేయకుండా ఇంటి వద్దనే ఉంటూ వచ్చేవాడు. మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలంటూ తరచూ భార్యతో గొడవపడేవాడు. అతని వేధింపులు తాళలేక తాను కష్టపడి సంపాదించుకుని దాచుకున్న డబ్బులో కొంత మేర ఇస్తూ వచ్చింది. దీంతో నరసింహప్ప మద్యం మహమ్మారికి పూర్తిగా లొంగిపోయాడు. ఒక్కపూట మద్యం తాగకపోతే విచిత్రంగా ప్రవర్తిస్తూ వచ్చేవాడు.
డబ్బు ఇవ్వలేదనే అక్కసుతో..
మద్యం వ్యసనం నుంచి భర్తను బయట పడేసేందుకు లక్ష్మీదేవి విశ్వప్రయత్నాలు చేస్తూ వచ్చింది. అయినా అతనిలో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం మద్యం తాగేందుకు అవసరమైన డబ్బు కోసం లక్ష్మీదేవిని నరసింహప్ప ప్రాధేయపడ్డాడు. ఆమె ఇవ్వలేదు. అలవాటు మానుకోవాలని హితవు చెప్పింది. సాయంత్రం మరోసారి ఆమెతో గొడవపడ్డాడు. బెదిరించాడు. భర్తలో మార్పు తీసుకురావాలనే కృతనిశ్చయంతో ఉన్న ఆమె డబ్బు ఇచ్చేందుకు నిరాకరించింది. మొత్తం సంసారాన్ని తానే నెట్టుకొస్తున్నానని, రోజూ మద్యం తాగేందుకు డబ్బు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలంటూ అసహనం వ్యక్తం చేసింది.
రాత్రి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చివరకు విచక్షణ కోల్పోయిన నరసింహప్ప శనివారం అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్య లక్ష్మీదేవి (45)పై గొడ్డలితో దాడి చేశాడు. మెడపై బలమైన వేటు పడడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. తెల్లవారుజామున నరసింహప్ప సోదరుడు కుమారుడు ఈరన్న పాల కోసం వచ్చినప్పడు ఈ విషయం వెలుగు చూసింది. ‘పిన్నమ్మ ఎక్కడకు పోయింది కనిపించడం లేదు’ అంటూ ఇంటి బయట కూర్చొన్న చిన్నాన్నను ఈరన్న అడిగినప్పుడు అతని మౌనమే సమాధానమైంది.
దీంతో వెనుదిరుగుతున్న సమయంలో రక్తపుమడుగులో పడి ఉన్న పిన్నమ్మ కనిపిచండంతో ఒక్కసారిగా అతను నిశ్చేష్టుడయ్యాడు. ఏమి జరిగిందంటూ చిన్నాన్నను నిలదీశాడు. అతను సమాధానమివ్వకపోవడంతో కుటుంబసభ్యులకు, పోలీసులకు విషయాన్ని చేరవేశాడు. ఘటనాస్థలాన్ని సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ యువరాజ్ పరిశీలించారు. హతురాలి సోదరుడు ఈరన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, అక్కడే ఉన్న నిందితుడు చిన్న నరసింహప్పను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment