విడిగాఉంటే..విడిపోయినట్టే
హైకోర్టు ధర్మాసనం తీర్పు
- సుదీర్ఘకాలం విడిగా ఉన్నవాళ్లు విడాకులు కోరుతుంటే ఇవ్వాల్సిందే
- భార్యాభర్తల మధ్య గొడవలు సహజం.. కానీ అవి తీవ్రంగా మారితే జీవితం దుర్భరం
- అలాంటి దంపతులు కలసి ఉండేకన్నా విడిపోవడమే మేలు
సాక్షి, హైదరాబాద్: మనస్పర్థల వల్ల దంపతులు సుదీర్ఘకాలం నుంచి విడివిడిగా ఉంటుంటే వారి వివాహ బంధం విచ్ఛిన్నమైనట్లేనని ఉమ్మడి హైకోర్టు తేల్చి చెప్పింది. ఇటువంటి సందర్భాల్లో వారు విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. ‘ఇద్దరి శరీరాలు, ఆత్మల కలయికే వివాహం. ఏ దంపతులైతే స్నేహ, సామరస్యపూర్వకంగా ఆహ్లాదకర వాతావరణంలో జీవిస్తుంటారో వారి వైవాహిక జీవి తం ఆనందంగా సాగిపోతూ ఉంటుంది. భార్యభర్తల మధ్య అప్పుడప్పుడు గొడవలు సహజం.
అయితే అవి పిల్లి-ఎలుక, పాము-ముంగిసలాగా ఉంటే వారి జీవితం అత్యంత దుర్భరం. దంపతుల మధ్య ఒక్కసారి అనుబంధమనే తీగ తెగిపోయి, పరస్పర విశ్వాసం కోల్పోతే వాటిని పునరుద్ధరించడం సులభం కాదు. ఇటువంటి సందర్భాల్లో వివాదం న్యాయస్థానానికి చేరినప్పుడు కోర్టులు సహజంగా వారిద్దిరినీ కలిపేందుకు ప్రయత్నిస్తాయి. ఈ ప్రయత్నాలు ఫలవంతం కాకున్నా వారిని కలసి ఉండాలని బలవంతం చేస్తే అది దుష్పరిణామాలకు దారితీస్తుం ది. నిత్యం కీచులాటలతో బాధపడుతూ కలసి ఉండేకన్నా దంపతులు విడిపోయి ఎవరి జీవితాలు వారు గడపడం ఉత్తమం’ అని ధర్మాసనం పేర్కొంది.
ఇదీ వివాదం: నిజామాబాద్‌కు చెందిన బ్రహ్మానందానికి వరంగల్ జిల్లాకు చెందిన రమాదేవితో 1982లో వివాహమవగా 1995లో వారిద్దరూ వేరుపడ్డారు. అదే ఏడాది ఆమె నిజామాబాద్ కోర్టులో పోషణ ఖర్చుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే సమాచారం ఇవ్వకుండానే రమాదేవి తనను విడిచిపెళ్లిపోయిందని బ్రహ్మానందం కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న కోర్టు రమాదేవి అకారణంగానే ఇల్లు విడిచి వెళ్లినందున ఆమెకు పోషణ ఖర్చులు చెల్లించనక్కర్లేదని 1997లో ఉత్తర్వులిచ్చింది. తరువాత వివాదం హైకోర్టుకు చేరడంతో ఆమెకు పోషణ ఖర్చులు చెల్లిస్తున్న బ్రహ్మానందం... 2004లో వివాహ రద్దు కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే బ్రహ్మానందం తనను మెడపెట్టి బయటకు గెంటేశారంటూ విచారణ సమయంలో రమాదేవి కోర్టుకు నివేదించారు. దీంతో దిగువ కోర్టులో విడాకుల కోసం బ్రహ్మానందం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు 2005లో కొట్టేసింది.
కలసి ఉండేందుకు ఎన్నడూ ప్రయత్నించలేదు...
దీనిపై బ్రహ్మానందం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారించి ఇటీవల తీర్పు వెలువరించింది. 1995 నుంచి రమాదేవి వేరుగానే ఉంటున్నారని, తనను బయటకు గెంటేశారన్న వాదన మినహా అందుకు సంబంధించి ఆమె ఎటువంటి ఆధారాలను చూపలేదని తీర్పులో పేర్కొంది. బ్రహ్మానందంతో కలసి ఉండేందుకు 1995 తరువాత ప్రయత్నించలేదని తెలిపింది. సహేతుక కారణం లేకుండానే రమాదేవి భర్త నుంచి వేరుగా ఉంటోందని ధర్మాసనం తేల్చింది. దీన్నిబట్టి ఆమె వైవాహిక బంధాన్ని త్యజించాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోందని వివరించింది.