marriage cancellation
-
అందుకే మెహ్రీన్ పెళ్లి క్యాన్సిల్ చేసుకుందా?!
Mehreen Pirzada Calls Off Engagement: ‘కృష్ణగాడి వీర ప్రేమకథ’ మూవీతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచమైంది పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా. ఆ తర్వాత మహానుభావుడు, కవచం, చాణక్య, ఎఫ్2 వంటి చిత్రాల్లో నటించి సక్సెస్‌ను అందుకుంది. వరుస ఆఫర్స్‌తో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్‌తో రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకుంది. అనంతరం ఈ విషయాన్ని అధికారంగా ప్రకటించింది. ఆ తర్వాత వెంటనే పెళ్లి అనంతరం తను నటించనని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది. పెద్దింటికి కోడలు అవుతుంది కదా అందుకే నటించకూడదని నిర్ణయించుకుందేమోనని అనుకుని అభిమానులంతా ఆమె నిర్ణయాన్ని స్వాగతించారు. ఇక గత నెలలలోనే భవ్యతో తన పెళ్లి నిశ్చయమైందని, పెళ్లి పనులతో బిజీగా ఉన్నట్లు చెప్పిన మెహ్రీన్ సడెన్‌గా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడినట్లు చెప్పింది. అంతేగాక పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే అంగరంగ వైభవంగా సన్నిహితులు, బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. ఈ గ్యాప్‌లో తను సంతకం చేసిన ప్రాజెక్ట్స్‌ను పూర్తి చేసేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో మెహ్రీన్‌కు ఓ పెద్ద హీరోతో నటించే ఛాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మూవీకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా సమాచారం. అయితే త్వరలోనే పెళ్లి పెట్టుకుని మెహ్రీన్ కొత్త ప్రాజెక్ట్స్‌కు ఓకే చెప్పడం అందరిని కాస్త ఆశ్యర్యపరిచినా.. పెళ్లికి ఇంకా చాలా గ్యాప్ ఉందేమోనని అభిప్రాయపడ్డారు. ఏమైందో ఏమో తెలియదు శనివారం ఉదయం లేచేసిరికి తన సోషల్ మీడియా ఖాతాల్లో భవ్య బిష్ణోయ్‌తో తను వివాహం రద్దు చేసుకున్నట్లు పోస్టులు దర్శనం ఇచ్చాయి. ‘ఇక నుంచి భవ్యతో కానీ, తన కుటుంబ సభ్యులతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది నా ఇష్టంగా తీసుకున్న నిర్ణయం. నా వ్యక్తిగతం. ప్రతిఒక్కరు నా నిర్ణయాన్ని, ప్రైవసీని గౌరవిస్తారని అనుకుంటున్న’ అని ఆమె పోస్టులు చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఓ సీనియర్ స్టార్ హీరో అని, ఆయన సినిమాలో అవకాశం రావడం వల్లే ఈ నిర్ణయం తీసుకుందంటూ నెటిజన్లు తమదైన శైలిలో చర్చించుకుంటున్నారు. -
విడిగాఉంటే..విడిపోయినట్టే
హైకోర్టు ధర్మాసనం తీర్పు - సుదీర్ఘకాలం విడిగా ఉన్నవాళ్లు విడాకులు కోరుతుంటే ఇవ్వాల్సిందే - భార్యాభర్తల మధ్య గొడవలు సహజం.. కానీ అవి తీవ్రంగా మారితే జీవితం దుర్భరం - అలాంటి దంపతులు కలసి ఉండేకన్నా విడిపోవడమే మేలు సాక్షి, హైదరాబాద్: మనస్పర్థల వల్ల దంపతులు సుదీర్ఘకాలం నుంచి విడివిడిగా ఉంటుంటే వారి వివాహ బంధం విచ్ఛిన్నమైనట్లేనని ఉమ్మడి హైకోర్టు తేల్చి చెప్పింది. ఇటువంటి సందర్భాల్లో వారు విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. ‘ఇద్దరి శరీరాలు, ఆత్మల కలయికే వివాహం. ఏ దంపతులైతే స్నేహ, సామరస్యపూర్వకంగా ఆహ్లాదకర వాతావరణంలో జీవిస్తుంటారో వారి వైవాహిక జీవి తం ఆనందంగా సాగిపోతూ ఉంటుంది. భార్యభర్తల మధ్య అప్పుడప్పుడు గొడవలు సహజం. అయితే అవి పిల్లి-ఎలుక, పాము-ముంగిసలాగా ఉంటే వారి జీవితం అత్యంత దుర్భరం. దంపతుల మధ్య ఒక్కసారి అనుబంధమనే తీగ తెగిపోయి, పరస్పర విశ్వాసం కోల్పోతే వాటిని పునరుద్ధరించడం సులభం కాదు. ఇటువంటి సందర్భాల్లో వివాదం న్యాయస్థానానికి చేరినప్పుడు కోర్టులు సహజంగా వారిద్దిరినీ కలిపేందుకు ప్రయత్నిస్తాయి. ఈ ప్రయత్నాలు ఫలవంతం కాకున్నా వారిని కలసి ఉండాలని బలవంతం చేస్తే అది దుష్పరిణామాలకు దారితీస్తుం ది. నిత్యం కీచులాటలతో బాధపడుతూ కలసి ఉండేకన్నా దంపతులు విడిపోయి ఎవరి జీవితాలు వారు గడపడం ఉత్తమం’ అని ధర్మాసనం పేర్కొంది. ఇదీ వివాదం: నిజామాబాద్‌కు చెందిన బ్రహ్మానందానికి వరంగల్ జిల్లాకు చెందిన రమాదేవితో 1982లో వివాహమవగా 1995లో వారిద్దరూ వేరుపడ్డారు. అదే ఏడాది ఆమె నిజామాబాద్ కోర్టులో పోషణ ఖర్చుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే సమాచారం ఇవ్వకుండానే రమాదేవి తనను విడిచిపెళ్లిపోయిందని బ్రహ్మానందం కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న కోర్టు రమాదేవి అకారణంగానే ఇల్లు విడిచి వెళ్లినందున ఆమెకు పోషణ ఖర్చులు చెల్లించనక్కర్లేదని 1997లో ఉత్తర్వులిచ్చింది. తరువాత వివాదం హైకోర్టుకు చేరడంతో ఆమెకు పోషణ ఖర్చులు చెల్లిస్తున్న బ్రహ్మానందం... 2004లో వివాహ రద్దు కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే బ్రహ్మానందం తనను మెడపెట్టి బయటకు గెంటేశారంటూ విచారణ సమయంలో రమాదేవి కోర్టుకు నివేదించారు. దీంతో దిగువ కోర్టులో విడాకుల కోసం బ్రహ్మానందం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు 2005లో కొట్టేసింది. కలసి ఉండేందుకు ఎన్నడూ ప్రయత్నించలేదు... దీనిపై బ్రహ్మానందం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారించి ఇటీవల తీర్పు వెలువరించింది. 1995 నుంచి రమాదేవి వేరుగానే ఉంటున్నారని, తనను బయటకు గెంటేశారన్న వాదన మినహా అందుకు సంబంధించి ఆమె ఎటువంటి ఆధారాలను చూపలేదని తీర్పులో పేర్కొంది. బ్రహ్మానందంతో కలసి ఉండేందుకు 1995 తరువాత ప్రయత్నించలేదని తెలిపింది. సహేతుక కారణం లేకుండానే రమాదేవి భర్త నుంచి వేరుగా ఉంటోందని ధర్మాసనం తేల్చింది. దీన్నిబట్టి ఆమె వైవాహిక బంధాన్ని త్యజించాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోందని వివరించింది. -
వరుడికి ఎయిడ్స్... ఆగిన రెండో పెళ్లి
పీటలపై ఆగిన పెళ్లి - ఎయిడ్స్‌తో రెండో పెళ్లికి సిద్ధమైన వరుడు - ఖాకీల రంగప్రవేశం.. వరుడికి పరీక్షలు - హెచ్ఐవీ ఉన్నట్లు నివేదిక హసన్‌పర్తి : ముహూర్తం ఉదయం 10 గంటలకు.. పెళ్లి పనులు చకచకా జరిగిపోతున్నారుు.. ఇంతలోనే పోలీసుల రంగప్రవేశం.. వరుడిని వాహనంలో ఎక్కించుకుని వెళ్లి న పోలీసులు.. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు విషయం ఏమిటని అడిగినా సమాధానం రాని పరిస్థితి. హసన్‌పర్తి మండలం మడిపల్లికి చెంది న ఓ యువకుడికి హుస్నాబాద్ మండలం తౌళ్లపల్లికి చెందిన ఓ యువతితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. కొంతకాలం వారి దాంపత్యం జీవితం సవ్యంగానే సాగింది. మూడేళ్లుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుండగా వివిధ ప్రాంతాల్లో వైద్యం చేయించారు. చివరికి ఆమెకు హెచ్ఐవీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో భర్త కూడా పరీక్షలు చేరుుంచుకున్నాడు. అయితే అతడికి హెచ్ఐవీ(నెగటివ్) ఉన్నట్లు రిపోర్ట్ వచ్చింది. భార్య అనారోగ్యంతో బాధపడుతుండగా ఇరువర్గాలకు చెందిన కుటుంబ సభ్యులు అతడికి మరో పెళ్లి చేయాలని నిర్ణయించారు. రెండో పెళ్లి చేసుకున్నట్లయితే మొదటి భార్యకు రూ.50వేలు డిపాజిట్ చేయాలని నిర్ణయించారు. మడిపల్లికి చెందిన అమ్మాయితోనే... ఇదిలా ఉండగా, మడిపల్లికి చెందిన అమ్మాయితోనే రెండో పెళ్లికి సిద్ధమయ్యూడు. కాగా, బుధవారం ఉదయం 10 గంటలకు పెళ్లి ముహూర్తం ఉండగా, ఉదయం 7.15గంటలకు పోలీసులకు ఫోన్ వచ్చింది. అటు వైపు నుంచి ఓ వ్యక్తి మాట్లాడుతూ సార్.. మడిపల్లిలో ఫలాన యువకుడికి ఎయిడ్స్ ఉంది.. ఉదయం 10 గంటలకు పెళ్లి ముహూర్తం.. మీరు వెళితే... ఓ యువతి జీవితం నాశనం కాకుం డా ఉంటుందని ఫోన్ పెట్టేశాడు. స్థానిక ఎస్సై రవికిరణ్ సమాచారాన్ని సీఐ రఘుచందర్‌కు చేరవేశారు. దీంతో పోలీసులు మడిపల్లికి వెళ్లి వరుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. కాగా, వరుడిని వైద్య పరీక్షల నిమిత్తం ఓ డయాగ్నస్టిక్ సెంటర్‌కు పంపించారు. సుమారు రెండు గంటల తర్వాత నివేదిక ఎస్సై చేతికి అందింది. దీంతో ఆయన స్థానిక వైద్యులకు దానిని చూపించగా.. వారు హెచ్ఐవీ ఉన్నట్లు చెప్పారు. దీనిపై పోలీసులు కరుణ మైత్రి స్వచ్ఛంద వారికి సమాచారం అందించారు. వారు మడిపల్లికి వెళ్లి బాధిత కుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు.