
ఆన్‌లైన్‌లో డబ్బులు పంపినా.. దొరికేస్తారు!
పెద్దమొత్తంలో లావాదేవీలు నిర్వహిస్తున్నారా? ఇన్నాళ్లూ మూడో కంటికి తెలియకుండా డబ్బు రూపంలో ఇచ్చి పుచ్చుకునేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కుదరట్లేదు. తప్పనిసరిగా చెక్కు రూపంలో గానీ, లేదా ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా గానీ చేయాల్సి వస్తోంది. చెక్కయితే పన్ను పరిధిలోకి వస్తుందని చాలామంది ఈమధ్య ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపిస్తున్నారు. కానీ, 2.5 లక్షల రూపాయలు దాటితే ఆన్‌లైన్ చెల్లింపులు కూడా పన్ను పరిధిలోకి వస్తాయన్నది తాజా కబురు. అలాగే, సేవింగ్స్ బ్యాంకు ఖాతాలలో పెద్దమొత్తంలో డబ్బులు ఉన్నా కూడా వాటిని సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొత్తగా తెరిచిన బ్యాంకు ఖాతాలు, జనధన్ ఖాతాల నుంచి ఒకవేళ పెద్దమొత్తంలో డబ్బులు ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఒకరి నుంచి ఒకరికి బదిలీ అయినా కూడా వాటిపై దృష్టిపెడుతున్నారు.
ప్రధానమంత్రి జనధన యోజన కింద పెద్దమొత్తంలో ఖాతాలను తెరిచారు. ప్రస్తుతం దేశంలో 28 కోట్ల జనధన ఖాతాలున్నాయి. పెద్దనోట్ల రద్దు తర్వాత వాటిలో కొన్నింటిని నల్లధనాన్ని మార్చుకోడానికి ఉపయోగించుకున్నారన్న ఆరోపణలు గట్టిగానే వచ్చాయి. ఇప్పుడు కూడా ఆ ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బు నిల్వలు ఉంటే వాటిపై వివరణ కోరనున్నారు. నగదు ప్రవాహం ఎలా సాగుతోందన్న విషయాన్ని తాము ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటామని, అక్రమాలు బయటపడితే కఠిన చర్యలు తీసుకుంటామని.. అదే సమయంలో నిజాయితీపరులు మాత్రం ఈ విషయాలపై ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని ఆదాయపన్ను శాఖ అధికారులు చెబుతున్నారు.