
కిరాయి హంతకులతో భార్య, కొడుకును కడతేర్చిన కసాయి
హైదరాబాద్ నాగోల్‌లో దారుణం... కుటుంబ స్పర్ధలే కారణం
సాక్షి, హైదరాబాద్ : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి కసాయిగా మారాడు. కిరాయి హంతకులతో కలిసి కట్టుకున్న భార్యను, కన్నకొడుకును కత్తులతో పొడిచి మరీ కడతేర్చాడు! ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణం హైదరాబాద్ ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. నల్లగొండ జిల్లా సూర్యాపేట కుడకుడ ప్రాంతానికి చెందిన గుర్రం శశిధర్‌రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్. నార్కట్‌పల్లి మండలం నెమానికి చెందిన విజయలక్ష్మిని 1996లో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత అతను రెండో పెళ్లి చేసుకోవడంతో కొంతకాలంగా విజయలక్ష్మికి, అతనికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గత మేలో భర్తపై ఆమె సూర్యాపేట పోలీస్‌స్టేషన్‌లో వరకట్న వేధింపుల కేసు పెట్టింది. పోలీసులు అతన్ని అరెస్టుచేశారు. తర్వాత విజయలక్ష్మి తన కుమారుడు సాకేత్‌రెడ్డితో హైదరాబాద్‌లోని నాగోల్‌కు వచ్చి రోడ్ నంబర్ 1లోని సాయిమిత్ర అపార్ట్‌మెంట్‌లో అద్దెకుంటోంది. తనపై కేసు పెట్టిందన్న కోపంతో శశిధర్‌రెడ్డి బుధవారం రాత్రి 9.15 సమయంలో ముగ్గురు కిరాయి హంతకులను వెంటబెట్టుకుని విజయలక్ష్మి ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వచ్చాడు. పోలీసులమని చెప్పడంతో వాచ్‌మన్ వారిని విజయలక్ష్మి ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు.
శశిధర్‌రెడ్డి, మిగతా ముగ్గురు లోనికెళ్లి విజయలక్ష్మి (38), పక్కనే ఉన్న సాకేత్‌రెడ్డి (14)లపై తల్వార్లతో దాడి చేసి హత్య చేశారు. అదే గదిలో ఉన్న వారి బంధువు సంధ్య కేకలు వేయడంతో కిరాయి హంతకుల్లో భుజంగరావు, మోహన్‌రావు గోడ దూకి పారిపోగా మూడో వ్యక్తి మధుసూదన్‌రావును స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. శశిధర్‌రెడ్డి మాత్రం బాత్రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఎంతకూ బయటకు రాకపోవడంతో తలుపులపై పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విజయలక్ష్మికి వివాహేతర సంబంధం ఉందంటూ శశిధర్‌రెడ్డి ఆమెను కొన్నేళ్లుగా వేధిస్తున్నట్టు, ఈ క్రమంలోనే కక్ష పెంచుకుని దారుణానికి ఒడిగట్టినట్టు చెబుతున్నారు. కిరాయి హంతకులను వరంగల్ జిల్లా తొర్రూరు మండలానికి చెందిన వారిగా గుర్తించినట్టు ఎల్‌బీ నగర్ డీసీపీ రవివర్మ తెలిపారు.