అర్ధరాత్రి ఫోన్‌కాల్‌కు స్పందించిన కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయూమ్ అస్మీ
గంటల వ్యవధిలోనే క్షేమంగా కాపాడిన వీరవల్లి పోలీసులు
ఏపీ పోలీసుల పనితీరుకు తెలంగాణ వాసి ప్రశంసలు
హనుమాన్‌జంక్షన్ రూరల్: కుటుంబ వివాదాల కారణంగా ఇంటి నుంచి ఎవ్వరికీ చెప్పకుండా బయటకు వెళ్లి ఆత్మహత్యకు యత్నించిన వృద్ధ దంపతులను కృష్ణాజిల్లా వీరవల్లి పోలీసులు కాపాడారు. పశ్చిమ గోదావరిజిల్లా నరసాపురానికి చెందిన వృద్ధ దంపతులు గురువారం అర్ధరాత్రి సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయారన్న సమాచారం తెలుసుకున్న తెలంగాణలోని నిజామాబాద్‌లో నివసిస్తున్న కుమారుడు ఆందోళన చెందాడు. క్షణికావేశంలో వారు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడతారోనని భయపడ్డాడు.
ఆ అర్ధరాత్రి సమయంలోనే కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయూమ్ అస్మీకి ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. వృద్ధ దంపతుల ఆచూకీని కనిపెట్టి, వారిని తీసుకొచ్చే బాధ్యతను స్పెషల్ బ్రాంచ్ సీఐ జేవీ రమణ, వీరవల్లి ఎస్‌ఐ ఎం.చిరంజీవిలకు ఎస్పీ అప్పగించారు. ఎస్‌ఐ చిరంజీవి రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. కృష్ణా నదిలోకి దూకబోతున్న వీరిని నిలువరించి, వారికి నచ్చజెప్పి వీరవల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు.
కుటుంబ, అనారోగ్య సమస్యల వల్ల ఎవ్వరికీ భారం కాకూడదన్న ఉద్దేశంతోనే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనతో ఇంటి నుంచి బయటికి వెళ్లినట్టు ఎస్‌ఐకి వారు వివరించారు. వృద్ధ దంపతులను క్షేమంగా కాపాడి, ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా, మాజీ సైనికుడు అయిన ఆ వృద్ధ దంపతుల కుమారుడు ఏపీ పోలీసుల పనితీరుకు ముగ్ధుడయ్యారు. వెంటనే స్పందించిన కృష్ణా జిల్లా ఎస్పీ, వీరవల్లి ఎస్‌ఐ చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment