‘ఆకాంక్షను నేనే చంపాను’
కోల్ కతా: ఆకాంక్ష శర్మను తానే చంపానని మూడు హత్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు ఉదయన్ దాస్ ఒప్పుకున్నాడు. పశ్చిమ బెంగాల్ లోని బాంకురా జిల్లా కోర్టు ముందు నేరాన్ని అంగీకరించాడు. తనతో పాటు సహజీవనం చేసిన ఆకాంక్షను భోపాల్ లో హత్య చేసినట్టు కోర్టుకు తెలిపాడు. నేరాన్ని అంగీకరించిన ఉదయన్ బెయిల్ అభ్యర్థన పెట్టుకునేందుకు నిరాకరించాడు. కోర్టులో విచారణ సందర్భంగా హైడ్రామా చోటు చేసుకుంది. ఉదయన్ అమాయకుడని, అతడికి ఏమీ సంబంధం లేదని అతడి తరపు న్యాయవాది ఆరుప్ కుమార్ నంది నిరూపించే ప్రయత్నం చేశారు. ఆకాంక్ష ఆత్మహత్య చేసుకుందని వాదించారు.
మధ్యలో జోక్యం చేసుకున్న ఉదయన్ నేరం అంగీకరించాడు. తన యావదాస్తిని ఆకాంక్ష పేరుతో ఏర్పాటు చేసే ట్రస్టుకు రాసిస్తానని చెప్పాడు. భోపాల్ లోని ఇల్లు, తన తల్లి ఆభరణాలు, తండ్రి ఫిక్సిడ్ డిపాజిట్లు కూడా ట్రస్టుకు ఇచ్చేస్తానని పేర్కొన్నాడు. ఈ ట్రస్టుకు బాంకురా పోలీసులను ట్రస్టీలుగా పెట్టాలని అభ్యర్థించాడు. మరణశిక్షను తప్పించుకునేందుకే ఉదయన్ ఈ నాటకం ఆడుతున్నాడని ఆకాంక్ష కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆకాంక్షతో పాటు సొంత తల్లిదండ్రులు కూడా ఉదయన్ హతమార్చాడు.