
సంపాదనను సంపదగా మార్చుకోండి
మదుపరులు తెలివైన పెట్టుబడులు పెట్టడం ద్వారా సంపాదనను సంపదగా మార్చుకోవచ్చని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్
అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ జి.వి. రవిశేఖర్
సాక్షి మైత్రి ఇన్వెస్టర్ క్లబ్’ నిర్వహించిన
అవగాహన సదస్సుకు విశేష స్పందన
సాక్షి, కడప: మదుపరులు తెలివైన పెట్టుబడులు పెట్టడం ద్వారా సంపాదనను సంపదగా మార్చుకోవచ్చని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్; ఏపీ, తెలంగాణ రీజినల్ హెడ్ జి.వి.రవిశేఖర్ పేర్కొన్నారు. సాక్షి మైత్రి ఇన్వెస్టర్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం కడప నగరంలో నిర్వహించిన మదుపరుల అవగాహన సదస్సుకు విశేష స్పందన లభించింది. ఈ సదస్సులో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ప్రతినిధులు, ఫైనాన్సియల్ అడ్వైజర్‌లు ఇన్వెస్ట్‌మెంట్, సేవింగ్స్, ఈక్విటీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్స్ తదితర అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మదుపరులకు అవగాహన కల్పించారు.
సంపాదించిన సొమ్మును సరైన సమయంలో సరైన చోట పెట్టుబడి పెట్టినప్పుడు మంచి ఫలితాలు వస్తాయని రవిశేఖర్ చెప్పారు. జీవితంలో విజయం సాధించడానికి ఆర్థిక ప్రణాళిక ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సాధారణ ప్రజలు సైతం పెట్టుబడి పెట్టాల్సిన అంశాలపై అవగాహన తెచ్చుకోవాలన్నారు. రిటైర్‌మెంట్ తర్వాత కూడా చక్కటి జీవితానికి నేటి పొదుపు, మదుపు ఉపయోగపడతాయని వివరించారు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రాతిపదికన ఆర్థిక నిపుణుల సూచనలు తీసుకుని పెట్టుబడులు పెట్టాలన్నారు. నేటికీ సంప్రదాయ పద్ధతుల్లోనే పెట్టుబడులు పెడుతున్నారని దానికి భిన్నంగా అనేక అవకాశాలు వచ్చాయని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యం...
సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, హోల్‌లైఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ డెరైక్టర్ పి. శాంతిరాజ్ మాట్లాడుతూ... కోరుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు ఇన్వెస్ట్‌మెంట్ దోహదం చేస్తుందన్నారు. మెడికల్ హెల్త్ లాగే ఫైనాన్షియల్ హెల్త్ అవసరమన్నారు. ఎన్ని రకాల ఇబ్బందులు తలెత్తినా క్రమబద్ధమైన ఆర్థిక క్రమశిక్షణతో జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చన్నారు. భవిష్యత్ బాగుండాలంటే ఆర్థికంగా పునాదులు బాగుండాలని.. ఇందుకోసం ప్రతి ఒక్కరూ సంపాదనలో కొంత మొత్తమైనా పొదుపు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రతి ఇన్వెస్టర్‌కు కొన్ని అంశాలపై అవగాహన ఉండాలన్నారు. అప్పుడే చక్కటి నిర్ణయాలు తీసుకోగలడన్నారు.
పెరుగుతున్న ధరలు, భవిష్యత్ ఆర్థిక సూచీని అనుసరించి దానికి తగ్గ ప్రణాళికలను నేటి నుంచే అమలు చేయాలని చెప్పారు. సాక్షి కడప యూనిట్ ఇన్‌చార్జి వి.నాగభూషణం మాట్లాడుతూ ప్రజల్లో స్టాక్ మార్కెట్, ఇతరత్రా అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి సదస్సులు మరిన్ని నిర్వహించాలని వీటివల్ల ఆర్థిక అంశాలపై అవగాహన పెరిగిందని ఈ సందర్భంగా పలువురు మదుపరులు పేర్కొన్నారు.