ఎస్బీఐకు షాక్ ఇచ్చిన సఫాయ్ వాలా
ఎస్బీఐకు షాక్ ఇచ్చిన సఫాయ్ వాలా
Published Sun, Nov 20 2016 3:35 PM | Last Updated on Sat, Apr 6 2019 9:07 PM
ముంబై: భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్బీఐ)కు ఓ సఫాయ్ వాలా దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. రూ.7వేల కోట్ల మొండి బకాయిలను ఎస్బీఐ రద్దు చేస్తున్నట్లు వచ్చిన రిపోర్టులపై స్పందించిన సఫాయ్ వాలా తన రుణాన్ని కూడా రద్దు చేయాలని ఎస్బీఐకు లేఖ రాశాడు. నాసిక్ త్రయంబకేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ లో భావూరావు సోనవానే సఫాయ్ వర్కర్ గా పనిచేస్తున్నాడు. విజయ్ మాల్యాకు రుణాన్ని మాఫీ చేసిన చేత్తోనే తన రూ.1.5లక్షల రద్దు చేయాలని కోరాడు.
ఈ విషయంపై మాట్లాడిన భావూరావు.. మాల్యా రుణ మాఫీ నిర్ణయంపై ఎస్బీఐకు అభినందనలు చెప్పాడు. మాల్యా రుణ మాఫీతో పాటు తన రుణాన్ని కూడా మాఫీ చేయాలని బ్యాంకును అభ్యర్ధించినట్లు తెలిపాడు. తన కొడుకు ఆరోగ్య రీత్యా బ్యాంకు నుంచి లోను తీసుకున్నట్లు వెల్లడించాడు. తాను రాసిన లేఖపై బ్యాంకు మేనేజర్ ఇంకా సమాధానం ఇవ్వాల్సివుందని చెప్పాడు.
కాగా, శీతాకాల రాజ్యసభ సమావేశాల్లో ఈ విషయంపై సీపీఐ నాయకుడు సీతారం ఏచూరి అడిగిన ప్రశ్నకు స్పందించిన ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఎస్బీఐ రాసిన లేఖలో రుణ మాఫీ చేస్తామని ఎక్కడా చెప్పలేదని చెప్పారు. మాల్యా తదితరులు తీసుకున్న రుణాలు ఇంకా అలాగే ఉన్నాయని పేర్కొన్నారు.
Advertisement
Advertisement