మద్రాస్ ఐఐటీలో మరో ఆత్మహత్య!
చెన్నై: మద్రాస్ ఐఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బీ టెక్ (ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్) ఫైనల్ ఇయర్ చదువుతున్న రాహుల్ జీ ప్రసాద్ సోమవారం తనువు చాలించాడు. గంగా హాస్టల్ మూడో అంతస్తులో ఉంటున్న అతను తన గదిలో సీలింగ్కు ఉరి వేసుకొని కనిపించాడు. అయితే ఆత్మహత్య లేఖ లాంటిది ఏమీ దొరకలేదు. మృతుడి స్వస్థలం కేరళలోని కొల్లాం. అతని తల్లిదండ్రులు సాయంత్రానికి ఐఐటీకి చేరుకునే అవకాశముంది.
గత నెలలో మద్రాస్ ఐఐటీలో చదువుతున్న వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన నాగేంద్ర రెడ్డి (23) ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోకపోవడం వల్ల ఒత్తిడితో నాగేంద్ర ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. మరో విద్యార్థి మృతి పట్ల ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. విద్యార్థి మృతికి కారణాలు ఏమిటన్నది తెలియరాలేదని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ వృత్తి నిపుణులను అందిస్తున్న జాతీయస్థాయి సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ (ఐఐటీ). ఇలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదువుతున్న 68 మంది విద్యార్థులు గత మూడు దశాబ్దాల్లో ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఐఐటీల్లో జరుగుతున్న ఈ ఆత్మహత్యలపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.