
ఇమిగ్రేషన్ అధికారి పైశాచికం
నీకు పిల్లలెంతమంది? స్మోక్ చేస్తావా? చికెన్ తింటావా? పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నావా? ఒక్కదానివే వెళుతున్నట్టున్నావ్.. మజా చేయడానికేనా?
నీకు పిల్లలెంతమంది? స్మోక్ చేస్తావా? చికెన్ తింటావా? పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నావా? ఒక్కదానివే వెళుతున్నట్టున్నావ్.. మజా చేయడానికేనా? భర్త ఊళ్లో లేనప్పుడు ఒక్కసారైనా వేరే వ్యక్తితో గడిపావా? నా ద్వారా మూడో సంతానాన్ని కంటావా? మీ ఆయన లేనప్పుడు కాల్ చేస్తా.. నీ ఫోన్ నంబర్ ఎంత?.. ఇవీ.. ఒంటరిగా ప్రయాణిస్తోన్న ఓ మహిళను ఢిల్లీ ఎయిర్ పోర్టు ఇమిగ్రేషన్ అధికారి అడిగిన పైశాచిక ప్రశ్నలు!
హాంకాంగ్ లో ఉంటోన్న తన భర్తను కలుసుకునేందుకు మార్చి 18న బెంగుళూరులో బయలుదేరిన మహిళ.. ఇంటర్నేషనల్ సర్వీస్ ఎక్కేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోని ఇమిగ్రేషన్ కౌంటర్కు వెళ్లింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న వినోద్ కుమార్ అనే ఇమిగ్రేషన్ అసిస్టెంట్ దారుణమైన ప్రశ్నలడిగి ఆ ప్రయాణికురాలిని మానసికంగా, లైంగికంగా వేధించాడు. హాంకాంగ్ వెళ్లే ఫ్లయిట్ ఎక్కేంతవరకు ఆమె వెంటే తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేశాడు.
మార్చి 23న భర్తతో కలిసి ఇండియా తిరిగొచ్చిన ఆమె.. కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ ఎయిర్ పోర్టు ఉన్నతాధికారులకు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదుచేసింది. స్పందించిన అధికారులు వినోద్ కుమార్ను సస్పెండ్ చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ ఘటనతో ఎయిర్ పోర్టుల్లో మహిళల భద్రత చర్చనీయాంశంగా మారింది.