‘వేలి ముద్ర’ పుట్టింది ఎక్కడో తెలుసా?
న్యూఢిల్లీ: ఒకప్పుడు సంతకం చేయడం రాకపోతే వేలి ముద్రలు తీసుకునేవారు. వేలి ముద్రగాళ్లు అంటూ చదువురాని వాళ్లను వెక్కిరించేవారు కూడా. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆధార్ కార్డులకు కూడా గుర్తింపు కోసం వేలి ముద్రలనే ప్రమాణంగా తీసుకుంటున్నారు. ప్రపంచంలో ఈ వేలి ముద్రల విధానం పుట్టిందే భారత దేశంలో. అదీ 1858 సంవత్సరంలో.
భారత్ బ్రిటీష్ పాలనలో ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లి జిల్లా, జాంగీపూర్ (అప్పట్లో జుంగీపూర్ అనేవారు)లో చీఫ్ మెజిస్ట్రేట్ సర్ విలియం జేమ్స్ హర్చెల్ వేలి ముద్రల విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టారు. అప్పట్లో వేలి ముద్రంటే అరచేయి మొత్తాన్ని తీసుకునేవారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి, స్థానిక వ్యాపారవేత్త రాజ్యధర్ కొనాయ్ మధ్య కుదురిన ఓ ఒప్పందానికి తొలిసారి వేలి ముద్ర తీసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం తరఫున కుదుర్చుకున్న ఏ ఒప్పందానికైనా ఆ మేజిస్ట్రేట్ వేలి ముద్రలనే అమలు చేశారు.
ఆ తర్వాతి కాలంలో పాల్ జీన్ కౌలియర్, థామస్ టేలర్ అనే శాస్త్రవేత్తలు వేలి ముద్రల ప్రాధాన్యతను శాస్త్రీయంగా నిరూపించారు. వేలి ముద్రల ద్వారా నేరస్థులను గుర్తించడం వారి శాస్త్రవిజ్ఞానం వల్లనే సాధ్యమైంది. 1887, జూన్ నెలలో ప్రపంచంలోనే తొలిసారిగా కోల్‌కతాలో ఫింగర్ ప్రింట్ బ్యూరోను అప్పటి ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఎడ్వర్డ్ రిచర్డ్ హెన్రీ ఏర్పాటు చేశారు. వేలి ముద్రలను ఎలా విశ్లేషించాలో ఆయన చెప్పిన విధానాన్నే భారత్ నేటికి ఆచరిస్తోంది. ఇప్పుడు ఆధార్ కూడా ప్రపంచంలోనే అతిపెద్ద డేటాబేస్‌ను కలిగి ఉంది.