మూడో అతిపెద్ద కన్జ్యూమర్ ఎకానమీ మనదే!
ముంబై : ఓ వైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నా, అభివృద్ధి చెందిన దేశాలు తమ వినియోగాన్ని పెంచుకోవడంలో ఆపసోపాలు పడుతున్నా భారత్ మాత్రం అతిపెద్ద కన్జ్యూమర్ ఎకానమీగా వెలుగొందనుందని వెల్లడైంది. 2025 నాటికి భారత్ మూడో అతిపెద్ద వినియోగదారుని ఆర్థిక వ్యవస్థగా నిలువనుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) రిపోర్టు తెలిపింది. ఏదైనా విక్రయించాలనుకునే వారికి ఇండియానే కొత్త చైనా అని ఇది పేర్కొంది. వినియోగదారుల అభిరుచులు, వ్యయాల విషయంలో మార్పులు చోటుచేసుకుని భారత్ లో వినియోగత్వం మూడింతలు పెరిగి 2025 నాటికి 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని రిపోర్టు అంచనావేస్తోంది. ఏడాది ఏడాదికి భారత్ లో వ్యయాల వృద్ధి అంచనావేసిన గ్లోబల్ రేట్ కంటే రెట్టింపవుతుందని, 2025 నాటికి కచ్చితంగా మూడో అతిపెద్ద కన్జ్యూమర్ మార్కెట్ గా భారత్ నిలవడం ఖాయమని ఈ రిపోర్టు వెల్లడించింది.
వ్యయాల వృద్ధి రేటు గ్లోబల్ గా 5 శాతం అంచనావేస్తే, భారత్ లో ఆ రేటు 12 శాతంగా నమోదవుతోందని రిపోర్టు తెలిపింది. ఇలానే కన్జ్యూమర్ మార్కెట్ వృద్ధి చెందుతూ ఉంటే, కంపెనీలు తప్పనిసరిగా మల్టిపుల్ బిజినెస్ మోడల్స్ వైపు మొగ్గుచూపాలని, వినియోగదారుల అవసరాలు, అభిరుచులను స్వీకరిస్తూ అంతర్గత నమూనాను మార్చుకోవాల్సి ఉంటుందని ఈ రిపోర్టు సూచించింది. ఎమర్జింగ్ సోషల్ ట్రెండ్స్ వినియోగదారుల నమూనాలను మార్చేస్తుందని బీసీజీ సీనియర్ పార్టనర్ అభీక్ సింగీ తెలిపారు. గత మూడేళ్లలో ఆన్ లైన్ వినియోగదారులు ఏడింతలు పెరిగి 80 మిలియన్ల నుంచి 90 మిలియన్లగా నమోదయ్యారు. వినియోగత్వాన్ని పెంచడానికి డిజిటల్ మార్కెట్ ఎక్కువగా ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం డిజిటల్ పై ఖర్చు చేస్తున్న మొత్తం ఏడాదికి 45 బిలియన్ డాలర్లనుంచి రూ.50 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ మొత్తం 2025 నాటికి 500 బిలియన్ డాలర్ల నుంచి 550 బిలియన్ డాలర్లకు పెరుగుతోందని తెలిసింది.