భారత్-యూకే సంబంధాల్లో కొత్త శకం
న్యూఢిల్లీ: ‘యూకే పర్యటన.. భారత-ఇంగ్లాండ్ సంబంధాల్లో కొత్త శకానికి నాంది పలకనుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటనలో వాణిజ్య, ఆర్థిక, రక్షణ, విద్యుత్ రంగాల అభివృద్ధితోటు ఉగ్రవాదం, వాతావరణంలో మార్పుపైనా ఇంగ్లాండ్ ప్రధానితో చర్చించనున్నారు. దశాబ్దం తర్వాత యూకేలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని అయిన మోదీ.. ఆర్థిక సహకారంపైనే కీలకంగా చర్చ జరగనున్నట్లు తెలిపారు.
భావ సారూప్యత ఉన్న యూకేతో సత్సంబంధాల ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలకంగా మారేలా ముందడుగు వేస్తామని ఫేస్‌బుక్ ద్వారా ప్రధాని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో మోదీ.. బ్రిటన్ ప్రధాని కేమరూన్‌తో చర్చలతో పాటు.. బ్రిటన్ పార్లమెంటులో, ప్రవాస భారతీయులు వెంబ్లీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలోనూ ప్రధాని ప్రసంగించనున్నారు.