అమెరికాలో తెలుగు మహిళ ఘాతుకం
వాషింగ్టన్: అమెరికాలోని ఫ్లోరిడాలో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుజాత గూడూరు(44) తన కుమార్తె చేతన(17)ను .38 రివాల్వర్‌తో కాల్చి చంపి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నానని అయితే, చేతన అనాథగా మారుతుందని భావించి తొలుత ఆమెను కాల్చి, అనంతరం తనను తాను కాల్చుకున్నట్లు పోలీసులకు వివరించారు. కొన్ని వారాల కిందటే ఆత్మహత్య చేసుకోవాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్న సుజాత విషయాన్ని ఈ-మెయిల్ ద్వారా తన సోదరుడికి వివరించారు. చేతనపై రెండు రౌండ్లు కాల్పులు జరిపిన అనంతరం సుజాత తనపై కాల్పులు జరుపుకొన్నారు.
సోమవారం ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న తల్లీ కుమార్తెలను ఆర్లాండో వైద్యశాలకు తరలించారు. అక్కడ చేతన ప్రాణాలు కోల్పోగా సుజాత కోలుకుంటున్నారు. మరోవైపు ఈ ఉదంతం గురువారం గుంటూరులో కలకలం సృష్టించింది. సుజాత గుంటూరుకు చెందిన మహిళ అని, మానసిక వ్యాధితో బాధపడుతున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి.