ఇన్ఫీలో మరో బిగ్ వికెట్! | Infosys says V. Balakrishnan resigns | Sakshi
Sakshi News home page

ఇన్ఫీలో మరో బిగ్ వికెట్!

Published Sat, Dec 21 2013 3:49 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM

ఇన్ఫీలో మరో బిగ్ వికెట్!

ఇన్ఫీలో మరో బిగ్ వికెట్!

బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులు ఒక్కొక్కరుగా కంపెనీని వీడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో ఇన్ఫీ డెరైక్టర్, మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్‌ఓ) వి. బాలకృష్ణన్ కూడా చేరారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇన్ఫోసిస్ ప్రస్తుత సీఈఓ, ఎండీ ఎస్‌డీ శిబులాల్ తర్వాత ఈ టాప్ పోస్టు రేసులో ముందంజలో ఉన్నట్లు చెబుతున్న బాలకృష్ణన్(‘బాల’ అని సుపరిచితం) హఠాత్తుగా గుడ్‌బై చెప్పడం అటు పరిశ్రమ వర్గాలతోపాటు, విశ్లేషకులనూ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ నెల 31 నుంచి ఆయన రాజీనామా అమల్లోకి వస్తుందని ఇన్ఫోసిస్ శుక్రవారం బీఎస్‌ఈకి వెల్లడించిన సమాచారంలో పేర్కొంది. కాగా, ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఇన్ఫీ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి మళ్లీ బాధ్యతలు చేపట్టిన తర్వాత(ఈ జూన్‌లో) గత ఆరు నెలల కాలంలోనే ఎనిమిది మంది టాప్ అధికారులు ఇన్ఫీకి గుడ్‌బై చెప్పడం గమనార్హం. ఇదిలాఉండగా.. ఇన్ఫోసిస్ ల్యాబ్స్‌కు హెడ్‌గా వ్యవహరిస్తున్న సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ సుబ్రమణ్యం గోపరాజు కూడా వైదొలగుతున్నట్లు గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో 24 గంటల్లోనే ఇద్దరు టాప్ అధికారులు నిష్ర్కమించినట్లయింది.
 
 సొంత కుంపటి...: ఇన్ఫీ నుంచి వ్యక్తిగత కారణాలతోనే బయటికి వెళ్తున్నానన్న బాలకృష్ణన్... సొంతంగా ప్రైవేటు ఈక్విటీ(పీఈ) ఫండ్‌ను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. దీనికి సెబీ అనుమతికోసం వేచిచూస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఇన్ఫీ మాజీ వైస్‌ప్రెసిడెంట్ మోహన్‌దాస్ పాయ్, విప్రో మాజీ ఎగ్జిక్యూటివ్ గిరీష్ పరాంజపేలతో కలిసి బాలకృష్ణన్ ఈ పీఈ వెంచర్‌ను ప్రారంభిస్తుండటం గమనార్హం. మరో ఐటీ కంపెనీకి మారే ప్రణాళికలేవీ ప్రస్తుతానికి లేవని... ఏడాదిగా ఇన్ఫీకి రాజీనామా నిర్ణయంపై ఆలోచిస్తున్నానని కూడా ఆయన చెప్పారు. కాగా, మూర్తి చైర్మన్‌గా తిరిగి రావడానికి.. తన నిష్ర్కమణకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. నారాయణ మూర్తి పునరాగమనం ఇన్ఫీకి చాలా ప్రయోజనకరమైన అంశమని కూడా పేర్కొన్నారు. బాలకృష్ణన్ ప్రస్తుతం అనుబంధ సంస్థలైన ఇన్ఫోసిస్ బీపీఓ విభాగానికి హెడ్‌గా, ఇన్ఫోసిస్ లోడ్‌స్టోన్ చైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు. కాగా, బాల నిష్ర్కమణ ఇన్ఫీకి కచ్చితంగా పెద్ద దెబ్బేనని... భారత్‌లో అత్యుత్తమ సీఎఫ్‌ఓల్లో ఒకరిగా ఆయన తనదైన ముద్రను వేశారని మోహన్‌దాస్ పాయ్ వ్యాఖ్యానించడం విశేషం. కంపెనీలో ఆయన మరింత ఉన్నత పాత్ర పోషించాల్సిందని.. అయితే, ఆయన ఒక మంచి టీమ్‌ను ఇన్ఫీకి అందించారని కూడా పాయ్ పేర్కొన్నారు.


 బోర్డులోకి కిరణ్ మజుందార్ షా...
 బాలకృష్ణన్ రాజీనామా నేపథ్యంలో ఇన్ఫీ యాజమాన్యం తక్షణం స్పందించింది. క్రిస్ గోపాలకృష్ణన్‌ను తాత్కాలికంగా బీపీఓ విభాగానికి హెడ్‌గా నియమించింది. మరోపక్క, బీజీ శ్రీనివాస్‌ను ఇన్ఫోసిస్ లోడ్‌స్టోన్ చైర్మన్ వ్యవహరిస్తారని వెల్లడించింది. ఈ మేరకు చైర్మన్ నారాయణ మూర్తి ఒక ప్రకటన విడుదల చేశారు. ‘అత్యున్నత నిబద్ధత, మేధస్సు, ఉత్సాహంతో పనిచేసే ‘బాల’... ఇన్ఫీలో ఇక ఉండరన్న విషయాన్ని ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంది. కంపెనీ నిర్మాణంలో ఆయన పాత్ర ఎనలేనిది’ అని నారాయణ మూర్తి ఆయన రాజీనామాపై వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా.. బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షాను ఇన్ఫోసిస్ బోర్డులోకి స్వతంత్ర డెరైక్టర్‌గా తీసుకుంటున్నట్లు కంపెనీ ప్రకటించింది. అదేవిధంగా ఇన్ఫీ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ యూబీ ప్రవీణ్ రావును బోర్డులో హోల్‌టైమ్ డెరైక్టర్‌గా తీసుకుంటున్నట్లు కూడా వెల్లడించింది. కంపెనీ ఫైనాన్స్ విభాగాన్ని బలోపేతం చేయడంలో బాలకృష్ణన్ కీలక పాత్ర పోషించారని ఇన్ఫీ సీఈఓ, ఎండీ శిబులాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
 
 వెళ్లిన వారికి బంపర్ ఆఫర్లే!
 ఇన్ఫోసిస్‌ను వదిలి వెళ్లిన ప్రముఖుల్లో బంపర్ ఆఫర్లు పొందిన వారూ ఉన్నారు. అశోక్ వేమూరి... ఆయన సెప్టెంబర్‌లో ఐగేట్ కంపెనీకి ప్రెసిడెంట్, సీఈవోగా నియమితులయ్యారు. ఇన్ఫీతో పోలిస్తే దాదాపు మూడింతల అధిక ప్యాకేజీ(రూ.14.5 కోట్లు) వేమూరికి లభించడం విశేషం. ఇన్ఫోసిస్‌లో 2012-13లో వేమూరికి లభించిన ప్యాకేజీ మొత్తం రూ. 4.9 కోట్లే.
 
 కంపెనీలో ఏదో జరుగుతోంది...?
 నారాయణ మూర్తి పునరాగమనం తర్వాతే ఇన్ఫీకి టాప్ ఎగ్జిక్యూటివ్‌లు వరుసగా గుడ్‌బై చెబుతుండటంపై పరిశీలకుల్లో భిన్నాభిప్రాయాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూర్తితో విభేదాలు ఒక కారణమైతే.. సీనియర్లకు తగిన విలువనివ్వడంలేదన్న వాదనలూ ఉన్నాయి. ‘అగ్రశ్రేణి నిపుణులు కంపెనీ నుంచి వేగంగా వైదొలుగుతున్నారు. మూర్తి రాకను ఇన్ఫీ సిబ్బంది సానుకూలంగా పరిగణించినట్లు కనబడటం లేదు’ అని ఇకాన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు చెందిన అనిల్ సింఘ్వీ అభిప్రాయపడ్డారు. ఇన్వెస్టర్లు మూర్తిని పూర్తిగా స్వాగతించారని.. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల విషయంలో ఇది బెడిసికొట్టినట్లుందని విశ్లేషకులు అంటున్నారు. నారాయణ మూర్తి చైర్మన్‌గా మళ్లీ బాధ్యతలు చేపట్టిననాటి నుంచి ఇన్ఫీ షేరు పరుగులు తీస్తున్న సంగతి తెలిసిందే. బీఎస్‌ఈలో శుక్రవారం 1.1% ఎగబాకి ఆల్‌టైమ్ గరిష్టంతో(రూ.3,552) ముగిసింది. కాగా, మూర్తి పునరాగమనం తర్వాత ఆయన కొడుకు రోహన్ మూర్తిని తనకు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా నియమించుకోవడం తెలిసిందే. వాస్తవానికి   రోహన్‌ను వైస్ ప్రెసిడెంట్‌గా నియమించాలని ప్రతిపాదించారు. విమర్శలురావడంతో దీన్ని విరమించుకున్నారు. రోహన్‌ను కంపెనీ తదుపరి సీఈఓగా తీసుకొచ్చేందుకు మూర్తి పావులు కదపడం ఇష్టంలేకే సీనియర్లు ఒక్కొక్కరుగా గుడ్‌బై చెబుతున్నారన్న వాదనలూ లేకపోలేదు.‘బాల’ నిష్ర్కమణతో ఈ ఊహాగానాలు మళ్లీ తెరపైకివచ్చాయి. బాల రాజీనామాతో కంపెనీపై  ప్రభావం పడక పోయినా... టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వరుస గుడ్‌బైలతో దీర్ఘకాలంలో షేరుపై ప్రతికూలతకు దారితీయ్చొనేది నిపుణుల అభిప్రాయం.
 
 6 నెలలు.. 8 మంది...
 1. స్టీఫెన్ ఆర్ ప్రాట్: ఇన్ఫీ ఉత్తర అమెరికా విభాగం యుటిలిటీస్, రిసోర్సెస్ హెడ్.
     నవంబర్‌లో రాజీనామా
 2. కార్తీక్ జయరామన్: ఆస్ట్రేలియాలో ఇన్ఫీ బీపీఓ సేల్స్ హెడ్. సెప్టెంబర్‌లో గుడ్‌బై
 3. హంబెర్టో ఆండ్రేడ్: లాటిన్ అమెరికాలో ఇన్ఫీ బీపీఓ హెడ్. సెప్టెంబర్‌లో నిష్ర్కమణ.
 4. అశోక్ వేమూరి: కంపెనీ అమెరికా
     కార్యకలాపాల హెడ్. ఆగస్టులో గుడ్‌బై.
 5. సుధీర్ చతుర్వేది: ఇన్ఫీ వైస్‌ప్రెసిడెంట్,
     అమెరికాలో ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్. ఆగస్టులో రాజీనామా.
 6. బసబ్ ప్రధాన్: ఇన్ఫీ గ్లోబల్ సేల్స్ హెడ్. జూలైలో నిష్ర్కమణ.
 7. సుబ్రమణ్యం గోపరాజు:  ఇన్ఫీ ల్యాబ్స్ హెడ్, సీనియర్ వైస్‌ప్రెసిడెంట్. డిసెంబర్
     19న రాజీనామా
 8. వి. బాలకృష్ణన్: ఇన్ఫీ డెరైక్టర్, బీపీఓ హెడ్,  లోడ్‌స్టోన్ చైర్మన్. డిసెంబర్ 20న గుడ్‌బై
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement