ఇంటెల్ ‘షూటింగ్ స్టార్స్’ పేరుతో ఈ డ్రోన్లను సిద్ధం చేసింది.
ఒకటో నంబర్ ఫొటో చూశారుగా... ఏమనిపించింది? ‘ఇంటెల్’ ప్రకటనే కదా.. కొత్తేముంది? అంటున్నారా? ఫొటో కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇదేదో కంప్యూటర్/టీవీ స్క్రీన్‌పై కనిపించే యాడ్ కాదని స్పష్టంగా అర్థమైపోతుంది. విశాలమైన ఆకాశమే బ్యాక్‌గ్రౌండ్‌గా ఉన్న విషయమూ అర్థమవుతుంది. అరె... ఇదెలా సాధ్యమైంది? ఇప్పుడు రెండో నంబర్ ఫొటో చూడండి. దీంట్లో ఉన్నది ‘ఇంటెల్’ పేరున్న డ్రోన్. ఇలాంటివి ఓ 500 డ్రోన్లు.. మూడో నంబర్ ఫొటోలో చూపినట్లుగా గాల్లోకి ఎగిరితే తయారైంది ఒకటో నంబర్ ఫొటోలోని ఇంటెల్ ప్రకటన! విషయం ఏమిటంటే... అమెరికాలో ఏటా సూపర్‌బౌల్ బాస్కెట్‌బాల్ పోటీలు జరుగుతాయన్నది మీకు తెలిసిందే. ఈ ఏడాది పోటీల ప్రారంభోత్సవం హాఫ్‌టైమ్‌లో ఇంటెల్ డ్రోన్లతో ఈ వినూత్న ప్రదర్శన ఇచ్చింది.
ఇంటెల్ పేరును చూపేలా మాత్రమే కాకుండా రకరకాల ఆకారాలు, చిత్రాలను ఆకాశంలో ప్రదర్శించింది. మొత్తం ఐదు వందల డ్రోన్ల ఆకారాలు, అక్షరాలకు తగినట్లు నిర్దిష్ట ప్రాంతాల్లో నిలవడం... వెలుగులు చిమ్మడం దీని ప్రత్యేకత. ఇంటెల్ ‘షూటింగ్ స్టార్స్’ పేరుతో ఈ డ్రోన్లను సిద్ధం చేసింది. ఒక్కోటి కేవలం 28 గ్రాములు మాత్రమే ఉంటుంది. ఇరవై నిమిషాలపాటు మాత్రమే ఎగరగలదు. అన్నింటినీ ఒకేసారి నియంత్రించేందుకు ఇంటెల్ ఓ ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. ప్రతిదాంట్లో ఉండే ఎల్‌ఈడీ బల్బు కొన్ని లక్షల రంగులను ప్రదర్శించే సామర్థ్యం కలిగి ఉంది. వీటిన్నింటితో సూపర్‌బౌల్ ఇంటర్వెల్ టైమ్‌లో ఓవైపు లేడీ గాగా పాటల కచేరీ నడుస్తూంటే ఇంకోవైపు ఇంటెల్ ఓ లాంచ్‌ప్యాడ్‌పై అంగుళం ఎడంగా ఏర్పాటు చేసిన డ్రోన్లను పైకి ఎగరేసింది. ఇంకేముంది.. ఆకాశంలో అద్భుతం సాకారమైంది. తన ప్రకటనల మాదిరిగానే...విన్యాసాలన్నీ ముగిసిన తరువాత డ్రోన్లు ఇంటెల్ అన్న లోగోను ప్రదర్శించాయి.