మనం ఓడిపోయాం.. వెళ్లిపొండి లేదా చచ్చిపోండి
మనం ఓడిపోయాం.. వెళ్లిపొండి లేదా చచ్చిపోండి
Published Thu, Mar 2 2017 8:20 AM | Last Updated on Tue, Sep 5 2017 5:01 AM
ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ ఓడిపోయిందని, అందువల్ల అరబేతర దేశాలకు చెందిన యోధులంతా తిరిగి తమ తమ సొంతదేశాలకు వెళ్లిపోవాలి లేదా తమను తాము పేల్చుకుని చచ్చిపోవాలని ఆ సంస్థ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ చెప్పాడు. ఐసిస్ వీడ్కోలు ప్రసంగంలో ఇలా చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. తనను తాను ఖలీఫాగా ప్రకటించుకున్న బాగ్దాదీ 'వీడ్కోలు ప్రసంగం' పేరుతో ఒక ప్రకటన విడుదల చేశాడు. దాన్ని ఐసిస్ ప్రబోధకులకు, మతప్రవక్తలకు పంచిపెట్టారు. మోసుల్ నగరంలో ఇస్లామిక్ స్టేట్ మీద ఇరాకీ ఆర్మీ తన పట్టు బిగించడంతో ఐఎస్‌కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.
అందువల్ల ఇస్లామిక్ స్టేట్ కార్యాలయాన్ని మూసేయాలని, అరబ్ దేశాల వాళ్లు కాకుండా అందులో పనిచేస్తున్న ఇతర ఫైటర్లంతా తమ తమ సొంత దేశాలకు వెళ్లిపోవడం లేదా తమను తాము పేల్చేసుకుని చచ్చిపోవడం తప్పదని బాగ్దాదీ ఆదేశించాడు. అలా చనిపోయినవాళ్లకు స్వర్గంలో 72 మంది మహిళలు దక్కుతారని కూడా చెప్పాడు. బాగ్దాదీని ఎవరైనా పట్టుకుంటే దాదాపు రూ. 66 కోట్ల బహుమతి ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. పలుమార్లు దాడుల్లో బాగ్దాదీ తీవ్రంగా గాయపడ్డాడు. అతడు చనిపోయాడని కూడా చాలాసార్లు కథనాలు వచ్చాయి. 2014 సంవత్సరంలోనే తాను ఖలీఫానని ప్రకటించుకున్నాడు. అప్పట్లో తూర్పు సిరియా, ఉత్తర ఇరాక్ ప్రాంతాలను చాలావరకు ఐసిస్ ఆక్రమించుకుంది.
ఇప్పుడు చాలామంది ఐసిస్ నాయకులు ఇరాక్ నుంచి సిరియాకు పారిపోయారు. అమెరికా, ఇతర దేశాల అండతో ఇరాకీ సైన్యం గత సంవత్సరం అక్టోబర్ 17వ తేదీన మోసుల్ నగరాన్ని తిరిగి దక్కించుకోడానికి భారీ ఎత్తున దాడులు చేసింది. జనవరి నెలలో ఆ నగరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంది. అప్పటినుంచి ఆ దేశంలో ఐసిస్ పతనం మొదలైంది.
Advertisement
Advertisement