ప్రతి బీజేపీ కార్యకర్తపైనా కేసు పెట్టారు: జైట్లీ
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ కేబినెట్ లో కళంకిత మంత్రులున్నారని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ జైట్లీ తోసిపుచ్చారు. కేబినెట్ విస్తరణలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిని ఆయన వెనకేసుకొచ్చారు. వారికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకున్నాకే మంత్రులుగా ప్రధాని మోదీ అవకాశం కల్పించారని తెలిపారు.
తమ కేబినెట్ గురించి మాట్లాడే నైతికహక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన రామ్ శంకర్ కతిరియా సహా పలువురు మంత్రులు కళంకితులు అని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. యూపీలో ప్రతి బీజేపీ కార్యకర్తపైనా అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెట్టిందని జైట్లీ అన్నారు. సుజనా చౌదరి, గిరిరాజ్ సింగ్ పై కాంగ్రెస్ చేసిన ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు.