ఆంద్రప్రదేశ్‌లో జిందాల్ పవర్ ప్లాంట్
న్యూఢిల్లీ: జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో 2,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నది. అలాగే జార్ఖండ్‌లో 1,300 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నామని గ్రూప్ సీఈఓ, ఎండీ రవి ఉప్పల్ చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టుల కోసం(3,300 మెగావాట్లు) ఐదేళ్లలో రూ.20,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని వివరిం చారు. ప్రస్తుత తమ విద్యుదుత్పత్తి సామర్థ్యం 5,300 మెగావాట్లు అని, 2020 కల్లా 8,600 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయడం లక్ష్యంగా ఈ స్థాయి పెట్టుబడులు పెట్టనున్నామని పేర్కొన్నారు.
గత వారంలో ఛత్తీస్‌ఘఢ్‌లో 2,400 మెగావాట్ల తమ్‌నార్ ప్రాజెక్ట్ విస్తరణను పూర్తి చేశామని పేర్కొన్నారు. దీని కోసం రూ.13,000 కోట్లు పెట్టుబడులు పెట్టామని తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌ఘఢ్‌ల్లోని రెండు ప్రాజెక్టుల కోసం ఏడాదికి 16.5 మిలియన్ టన్నుల బొగ్గు అవసరమని అంచనాలున్నాయని చెప్పారు. బొగ్గు సమీకరణకు సంబంధించి వివిధ మార్గాల కోసం అన్వేషిస్తున్నామని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్లాంట్ తీరప్రాంతంలో ఏర్పాటు చేయనున్నందున విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడమా లేక దేశీయంగానే సమకూర్చుకోవడమా అనే అంశంపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు.