
మహిళలపై సీనియర్ నటుడి షాకింగ్ కామెంట్స్!
మహిళలపై టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు చేసిన వెకిలి వ్యాఖ్యలను మరిచిపోకముందే మరో సీనియర్ నటుడు ఇదేరీతిలో నోరుపారేసుకున్నాడు.
తిరువనంతపురం: మహిళలపై టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు చేసిన వెకిలి వ్యాఖ్యలను మరిచిపోకముందే మరో మలయాళీ సీనియర్ నటుడు ఇదేరీతిలో నోరుపారేసుకున్నాడు. మలయాళ చిత్ర పరిశ్రమలో ’కాస్టింగ్ కౌచ్’ (సినీ అవకాశాల పేరిట లోబరుచుకోవడం) లేనేలేదని చెప్పుకొచ్చిన ఆయన.. చెడ్డ మహిళలే ఇలా పక్కలోకి వెళుతుంటారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
’మలయాల చిత్ర పరిశ్రమ స్వచ్ఛంగా ఉంది. కాస్టింగ్ కౌచ్‌లాంటివి ఇండస్ట్రీలో లేనేలేవు. గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. మహిళల గురించి ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తే వెంటనే మీడియాకు తెలిసిపోయే పరిస్థితి ఉంది. కానీ, మహిళలు చెడ్డవారైతే.. వారు పక్కలోకి వెళ్లే అవకాశం ఉంది’ అని ప్రముఖ మలయాళ నటుడు, ఎంపీ ఇన్నోసెంట్ అన్నారు. మలయాళ చిత్రసీమలో కాస్టింగ్ కౌచ్‌పై విలేకరులు అడిగిన ఈ ప్రశ్నకు ఈవిధంగా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. 2014లో ఇన్నోసెంట్ వామపక్షాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా నిలబెడి ఎంపీగా గెలుపొందారు. మలయాళీ సూపర్ స్టార్లు సహా ప్రముఖ నటులందరూ సభ్యులుగా ఉన్న మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (అమ్మ) అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
నటుడు ఇన్నోసెంట్ వ్యాఖ్యలపై మహిళా సినీ నటుల సంఘం వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యూసీసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాలనుకుంటున్న కొత్త నటులు పలురకాల లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. కాస్టింగ్ కౌచ్ గురించి మా సహచరులైన పార్వతి, లక్ష్మీరాయ్ బాహాటంగానే మాట్లాడారు. ఇండస్ట్రీలో ఎలాంటి లైంగిక దోపిడీ లేదన్న ప్రకటనను మేం అంగీకరించబోం. ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి’ అని వ్యాఖ్యానించింది.