గతవారం బిజినెస్ | Last week Business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Mon, Dec 14 2015 4:46 AM | Last Updated on Thu, Jul 11 2019 8:48 PM

Last week Business

ఎఫ్‌ఐఐలకు ఐటీ శాఖ ఊరట
 
మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద నమోదై, భారత్‌లో శాశ్వత కార్యాలయాలు లేని విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు.. సమర్పించిన రిటర్నులు అసంపూర్తిగా ఉన్నా, వాటిని లోపభూయిష్టమైనవిగా పరిగణించబోమని ఆదాయపన్ను శాఖ (ఐటీ) తెలిపింది.  దీంతో దాదాపు 500 పైచిలుకు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐ)కు ఊరట లభించనుంది.
 
దశాబ్ద కనిష్టానికి దేశీ క్రూడ్
 అంతర్జాతీయంగా డిమాండ్‌కి మించి ఉత్పత్తి జరుగుతుండటంతో ముడిచమురు ధరలు అంతకంతకూ తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కొనుగోలు చేసే ముడిచమురుకి సంబంధించి నెలవారీ సగటు 38.61 డాలర్లకు తగ్గింది. ఈ రేటు స్థిరంగా కొనసాగితే 2004 తర్వాత దశాబ్ద కాలంలో ఇదే అత్యంత కనిష్ట నెలవారీ సగటు కానుంది. 2004 డిసెంబర్‌లో ఇండియన్ బాస్కెట్ రేటు 36.85 డాలర్లుగా ఉండేది.
 
2.1 శాతం పెరిగిన ప్రభుత్వ రుణ భారం
 ప్రభుత్వ రుణ భారం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 2.1 శాతం పెరిగింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈ భారం రూ. 53.01 లక్షల కోట్లుకాగా ఇది సెప్టెంబర్ క్వార్టర్‌కు రూ. 54.12 లక్షల కోట్లకు చేరిందని రుణ నిర్వహణపై విడుదలైన త్రైమాసిక నివేదిక తెలిపింది. మొత్తం రుణ భారంలో అంతర్గత రుణం వాటా 92.1 శాతం. విలువ రూపంలో ఇది రూ.49.85 లక్షల కోట్లు. 2015 సెప్టెంబర్‌నాటికి స్థూల దేశీయోత్పత్తి విలువతో పోల్చితే ఇది 37.4 శాతం.
 
సెబీ జరిమానాపై రిలయన్స్‌కు ఊరట
 2007లో ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ షేర్ల లావాదేవీల్లో రిలయన్స్ పెట్రోఇన్వెస్ట్‌మెంట్స్ (ఆర్‌పీఐఎల్) ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లంఘించిందన్న కేసు వివాదంలో సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్)లో ఊరట లభించింది. ఈ కేసును కొత్తగా మళ్లీ పరిశీలించి, మూడు నెలల్లోగా మరోసారి ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా సెబీని శాట్ ఆదేశించింది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ రాజస్తాన్‌లోని సౌరశక్తి ప్లాంట్‌కు అక్రమంగా తరుగుదల ప్రయోజనాన్ని పొందిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తప్పుపట్టింది.
 
కేబుల్ డిజిటైజేషన్ ఫేజ్-3 గడువు 31
 ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం టీవీ ప్రసారాలను వీక్షించడానికి కేబుల్ టీవీ సబ్ స్క్రైబర్స్ అందరూ డిజిటైజేషన్ ఫేజ్-3లో భాగంగా డిసెంబర్ 31 నాటికి ముందు సెట్ టాప్ బాక్స్‌లను (ఎస్‌టీబీ) ఏర్పాటు చేసుకోవాలని బ్రాడ్‌కాస్టింగ్ రంగ రెగ్యులేటర్ ట్రాయ్ సూచించింది.
 
భారత్.. ఒకే ఒక్కటి!

 ఒక్క భారత్‌ను మినహాయిస్తే... వర్ధమాన దేశాల్లో వృద్ధి తీరు నెమ్మదిగా ఉందని ప్రపంచబ్యాంక్ పేర్కొంది. వరుసగా ఐదేళ్ల నుంచీ ఇదే ధోరణి నెలకొందని తెలిపింది. భారత్ మినహా మిగిలిన బ్రిక్స్ (బీఆర్‌ఐసీఎస్- బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల వృద్ధి స్పీడ్ 2010 తరువాత భారీగా పడిపోయింది.  ఈ నేపథ్యంలో ఇంతక్రితం భావించినదానికన్నా భిన్నంగా... సుదీర్ఘకాలం ఆయా మార్కెట్లలో ఇదే నిరాశాకర పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడింది.
 
20 శాతం తగ్గిన ఇంటి ధరలు
 గత 18 నెలల కాలంలో హౌసింగ్ ధరలు సగటున 15-20 శాతంమేర తగ్గాయని రియల్టర్ల సమాఖ్య క్రెడాయ్ పేర్కొంది. ఇంతకు మించి ఇంకా తగ్గే అవకాశం లేదని తెలిపింది. పండుగ సీజన్‌లో ఇళ్ల అమ్మకాలు 15 శాతంమేర పెరిగాయని, దీనికి ధరలు తగ్గడం, గృహ రుణాలపై వడ్డీ రేటు తక్కువగా ఉండటం వంటి అంశాలు కారణాలుగా పనిచేశాయని క్రెడాయ్ ప్రెసిడెంట్ గీతాంబర్ ఆనంద్ మీడియాకు తెలిపారు.

ఫార్మాకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ!
 కేంద్ర రసాయనాల, ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ వచ్చే ఏడాది కాలంలో ఫార్మా, వైద్య పరికరాలకు సంబంధించి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని తె లిపారు. అలాగే చైనా నుంచి జరుగుతున్న భారీ డ్రగ్స్ దిగుమతులకు అడ్డుకట్ట వేయడానికి త్వరలోనే కటోచ్ ప్యానెల్ సిఫార్సులను అమలు చేస్తామని పేర్కొన్నారు. దేశీ పరిశ్రమకు చేయూతనందించడమే లక్ష్యంగా కేంద్రం వచ్చే వంద రోజుల్లో కటోచ్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తుందని తెలిపారు.
 
వచ్చే ఏడాది 7.8 శాతం వృద్ధి!
 వచ్చే ఏడాది భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 7.8 శాతంగాను, 2017లో 8 శాతం మేర ఉండగలదని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ నొమురా పేర్కొంది. భారత్ జీడీపీ ఈ ఏడాది 7.3 శాతంగా ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో వ్యాపార పరిస్థితులు మెరుగుపడే క్రమం ప్రాథమిక స్థాయిలో ఉందని, రాబోయే రెండు త్రైమాసికాల్లో వృద్ధి పుంజుకోగలదని ఆసియన్ ఎకనమిక్ అవుట్‌లుక్ నివేదికలో నొమురా తెలిపింది.
 
స్టీల్ ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ సుంకం

భారత ప్రభుత్వం కొన్ని స్టెయిన్‌లెస్ స్టీల్ ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించింది. చైనా, కొరియా, అమెరికా, యూరోప్ దేశాల నుంచి దిగుమతి అవుతున్న కొన్ని స్టెయిన్‌లెస్ స్టీల్ ఉత్పత్తులపై 5.39 శాతం నుంచి 57.39 శాతం రేంజ్‌లో యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించింది. ఈ సుంకం తదుపరి ఉత్తర్వులు వెలువడేదాకా ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుందని సీబీఈసీ పేర్కొంది.
 
పారిశ్రామికోత్పత్తి జూమ్

 వినియోగ ఉత్పత్తులు, యంత్రపరికరాల తయారీ ఊతంతో అక్టోబర్‌లో పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) అయిదేళ్ల గరిష్టానికి ఎగిసింది. 9.8 శాతం వృద్ధి నమోదు చేసింది. దీపావళి కొనుగోళ్లతో డిమాండ్ పెరుగుదల దీనికి తోడ్పడి ఉండొచ్చని అంచనాలు నెలకొన్నాయి. గతేడాది అక్టోబర్‌లో ఐఐపీ వృద్ధి మైనస్ 2.7 శాతంగా ఉంది. కేంద్రీయ గణాంకాల కార్యాలయం (సీఎస్‌వో) శుక్రవారం విడుదల చేసిన వివరాల ప్రకారం అక్టోబర్‌లో ఐఐపీ సూచీ 9.8 శాతం మేర పెరిగి 181.3గా ఉంది.
 
పెరిగిన పరోక్ష పన్ను వసూళ్లు
 పరోక్ష పన్నుల వసూళ్లు గత నెల లో 24% వృద్ధి చెందాయి. ఎక్సైజ్ సుంకాల వసూళ్లు పెరగడంతో పరోక్ష పన్ను వసూళ్లు 24% వృద్ధితో రూ. 55,297 కోట్లకు పెరిగాయి. గత ఏడాది ఇదే నెలలో ఈ వసూళ్లు రూ.44,475 కోట్లుగా ఉన్నాయి. ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల కాలానికి పరోక్ష పన్ను వసూళ్లు 34% వృద్ధితో రూ.4,38,291 కోట్లకు పెరిగాయి.
 
డీల్స్..

 సఈ-కామర్స్ సంస్థ పేటీఎం తాజాగా హోమ్ సర్వీసెస్ యాప్ నియర్‌డాట్‌ఇన్‌ను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ సుమారు 1.5- 2 మిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. సహైదరాబాద్‌కు చెందిన కస్టమ్ ఫర్నిచర్ ఈ-టెయిలర్ కస్టమ్‌ఫర్నిచర్‌డాట్‌కామ్ సంస్థ బెంగళూరుకు చెందిన ఆగ్నస్ క్యాపిటల్ నుంచి రూ.30 కోట్ల తాజా పెట్టుబడులను సమీకరించింది. సగృహోపకరణాల వ్యాపారాన్ని స్వీడన్ కంపెనీ ఎలక్ట్రోలక్స్‌కి విక్రయించే ప్రతిపాదనను జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) సంస్థ పక్కన పెట్టింది. జీఈ నిర్దిష్టంగా ఇందుకు గల కారణాలను వెల్లడించనప్పటికీ.. గుత్తాధిపత్యం నెలకొనవచ్చన్న సందేహాలతో అమెరికా నియంత్రణ సంస్థలు డీల్‌ను వ్యతిరేకిస్తుండటమే కారణమై ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఒప్పంద విలువ 3.3 బిలియన్ డాలర్లు.

సనేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ)లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తనకున్న 15 శాతం వరకూ వాటాను విక్రయించే ప్రక్రియను మొదలుపెట్టింది. ఎన్‌ఎస్‌ఈలో తమకున్న వాటాకు సరైన ధర కోసం చూస్తున్నామని ఎన్‌ఎస్‌ఈ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య చెప్పారు.  సప్రపంచంలోనే అతి పెద్ద కెమికల్ కంపెనీ ఏర్పాటుకు తెరతీస్తూ డో కెమికల్, డ్యుపాంట్ సంస్థలు విలీనం కానున్నాయి. దీంతో కొత్తగా ఏర్పడే కంపెనీ విలువ ఏకంగా 130 బిలియన్ డాలర్లుగా ఉండనుంది. డీల్ పూర్తిగా షేర్ల రూపంలో ఉంటుందని రెండు సంస్థలు తెలిపాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement