లెవీ విధానాన్ని పునరుద్ధరించాలి | Levi policy Resumed | Sakshi
Sakshi News home page

లెవీ విధానాన్ని పునరుద్ధరించాలి

Published Fri, Oct 30 2015 1:48 AM | Last Updated on Sun, Sep 3 2017 11:41 AM

లెవీ విధానాన్ని పునరుద్ధరించాలి

లెవీ విధానాన్ని పునరుద్ధరించాలి

* కేంద్రానికి తెలంగాణ రైస్ మిల్లర్ల డిమాండ్
 
*  ఇందిరా పార్కులో మహా ధర్నా
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం లేవీ విధానాన్ని పునరుద్ధరించాలని, రైస్‌మిల్లర్ల నుంచి ఎఫ్‌సీఐ ద్వారా లేవీ సేకరించాలని తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ, వివిధ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. కేంద్రం లేవీ రద్దు చేయడంతో బియ్యం మిల్లుల నిర్వాహణ కష్టంగా మారి మిల్లులు మూసుకునే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా నిర్వహించారు.

ధర్నాలోరైస్ మిల్లుల యజమానులతోపాటు వాటిపై ఆధారపడ్డ కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ధర్నానుద్దేశించి నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేంధర్‌రెడ్డి మాట్లాడుతూ లేవీ విధానంపై పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిశ్రమలను మూతపడేలా చేస్తోందని దుయ్యబట్టారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ లేవీ విధానం కొనసాగింపుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్నారు. టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ మిల్లర్ల సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎవరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వరని, మంత్రులేమో పనిచేయరని విమర్శించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ కొత్త పరిశ్రమలను తెస్తామంటున్న ప్రభుత్వం ఉన్న పరిశ్రమలను కాపాడడంలో విఫలమైందన్నారు.

తెలంగాణ రైస్ మిల్లర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గంపా నాగేందర్, ప్రధాన కార్యదర్శి వడ్డి మోహన్‌రెడ్డిలు మాట్లాడుతూ గతంలో ఉన్న 75 శాతం లేవీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం 2015-16కు పునరుద్ధరించి రైతులు, రైస్ మిల్లులను ఆదుకోవాలన్నారు. ఈ పంట సంవత్సరానికి కస్టమ్ మిల్లింగ్ చార్జీలను క్వింటాల్ ధ్యానం మిల్లింగ్‌కు పచ్చి బియ్యం (రా రైస్)కు రూ. 75, బాయిల్డ్ బియ్యానికి రూ. 100 చొప్పున చెల్లించాలని కోరారు.

మిల్లుల్లో ధ్యాన్యాన్ని టెస్ట్ మిల్లింగ్ చేయించి రా రైస్ దిగుబడి శాతాన్ని నిర్ణయించాలన్నారు. సూపర్ ఫైన్ బియ్యం అమ్మకంపై వ్యాట్‌ను 5 శాతం నుంచి 1 శాతానికి తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి, మాజీ మంత్రులు డీకే అరుణ, మండవ వెంకటేశ్వర్‌రావు, దక్షిణ భారత రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, ఏపీ రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

పోల్

Advertisement