
24 గంటలు తిరక్కముందే సీఎం ట్విస్ట్
భోపాల్: రాష్ట్రంలో రైతులు ఆందోళన విరమించి, శాంతి నెలకొనేవరకు దీక్ష కొనసాగిస్తానన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శిరాజ్ సింగ్ చౌహాన్ అనూహ్యంగా దీక్ష విరమించారు. భోపాల్‌లోని దసరా మైదానంలో దీక్ష ప్రారంభించి సరిగ్గా 24 గంటలు కూడా గడవకముందే ఆయన దీక్ష విరమణ ప్రకటన చేయడం గమనార్హం. ఆదివారం మధ్యాహ్నం రైతు సంఘాల నేతలు, రాష్ట్ర మంత్రులు కలిసి సీఎంకు నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేశారు.
నిరాహార దీక్ష చేయవద్దని రైతులు కోరినందునే తానీ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం శివరాజ్ మీడియాకు తెలిపారు. రుణాల మాఫీ, కనీస మద్దతుధర అంశాలపై రైతులు ఆందోళన చేయడం, మాంద్‌సౌర్‌లో ఐదుగురు రైతులను పోలీసులు కాల్చిచంపడంతో మధ్యప్రదేశ్ వ్యాప్తంగా తీవ్రహింస చెలరేగిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో శాంతిని కాంక్షిస్తూ సీఎం శివరాజ్ శనివారం నుంచి నిరాహారదీక్షకు దిగారు. అయితే మాంద్‌సౌర్‌లో పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలు సీఎంను కలిసి దీక్ష విరమించాలని కోరారు. ఆ మేరకు సీఎం నిమ్మరసం సేవించారు. కాగా, రైతులపై కాల్పులు జరిపినవాని కఠినంగా శిక్షిస్తామని సీఎం అన్నారు.